తమిళ హీరోలైన రజనీకాంత్, సూర్య, విక్రమ్ తదితరులు తెలుగు మార్కెట్ ని శాసిస్తున్నపుడు మన తెలుగు హీరోలు కూడా అక్కడ అదే స్థాయిలో సత్తా చాటాలని ప్రతి సినీ అభిమాని కోరుకుంటాడు. ఈ మేరకు మన స్టార్స్ ప్రయత్నాలు మొదలెట్టారు కూడా. ఇందుకు అన్ని విధాలా అర్హుడైన అల్లు అర్జున్ నిన్న తమిళ సినిమా డెబ్యూట్ కబురందించి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. అయితే ఈ ఆనందంలో అన్నాడో లేక మార్కెట్ ని చేజిక్కించుకోడానికి అన్నాడో గానీ తమిళనాడు “సొంతగడ్డ” అని అన్నాడు. ఇక్కడే తెలుగు వారి మనసు కాస్త చివుక్కుమంది.
అప్పట్లో పరిశ్రమ చెన్నైలో ఉండేదన్న విషయం తెలిసిందే. ఆ కారణంగా ఇప్పటి స్టార్ వారసుల్లో దాదాపు అందరూ అక్కడే పురుడుపోసుకున్నారు. అంతమాత్రాన అదే సొంతగడ్డ అనడం ఎంతవరకు సమంజసం..? తొలి సినిమాలోనే ‘మావయ్యది మొగళ్తూరు.. మా నాన్నది పాలకొల్లు’ అని నేటివిటీని పాటగా పాడుకున్న ఈ అల్లువారి పిల్లగాడు నిన్న ‘చెన్నై’ గాలి సోకేసరికి “సొంతగడ్డలో గెలిస్తే ఆ కిక్కే వేరప్పా” అంటూ ఉపన్యసించాడు. నిన్న జరిగిన కార్యక్రమం కూడా సినిమా ప్రకటన కంటే బన్నీ పరిచయ కార్యక్రమంలానే అనిపించింది. ఇందులోనే బన్నీ తంబీలను ఆకర్షించాలని వారు ఎంతగానో అభిమానించే ‘భాష’ని ఆయుధంగా చేసుకున్నాడు. ‘తప్పులున్నా తమిళంలోనే మాట్లాడతా”నంటూ కాస్త తడబడుతూనే తతంగం పూర్తి చేసేశాడు.
ఏదేమైనా అనువాద సినిమాల రూపేణా ఇప్పటికే మలయాళంలో స్టార్ స్టేటస్ అందుకున్న అల్లు అర్జున్ ఇక తమిళ సినిమానీ ప్రభావితం చేయనున్నాడు. ఇక మిగిలింది బాలీవుడ్ మాత్రమే.