“నేను మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పనీ పబ్లిసిటీ కోసమే” అంటూ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిన రాంగోపాల్ వర్మ అప్పట్నుంచి అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నాడు. అందుకే ఆయన చేసే చేతలు కానీ మాట్లాడే మాటలు, ముఖ్యంగా ఆయన రెండు పెగ్గులు వేశాక పెట్టే ట్వీట్లు జనాలు సీరియస్ గా తీసుకోవడం ఎప్పుడో మానేశారు. మహా అయితే ఎంటర్ టైన్మెంట్ కోసం ఆయన ట్వీట్స్ ను సరదాగా షేర్ చేసుకొంటున్నారు జనాలు. ఇప్పటివరకూ ఆయన ఎన్నో ప్రొజెక్ట్స్ ను ఎనౌన్స్ చేశాడు. అందులో సగానికిపైగా కనీసం సెట్స్ కు కూడా వెళ్లలేదు. ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదనుకోండి. అయితే.. పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డితో బూతులు తిట్టించి అనవసరమైన పెంటను నెత్తిమీద వేసుకొన్నాడు వర్మ. ఆ ఎఫెక్ట్ ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “ఆఫీసర్” మీద పడిందనుకోండి.
అయితే.. ఇవాళ వర్మ “ఆర్జీవి అన్ స్కూల్” అనే ఫిలిమ్ స్కూల్ ను ప్రారంభిస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా ఉన్నట్లుంది ఫిలిమ్ స్కూల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి తనదైన శైలిలో వింతగా స్పందించాడు వర్మ. “నేను వెండితెర ఉగ్రవాదిని. నాలాంటి సినిమా ఉగ్రవాదులను తయారు చేసి పరిశ్రమలోకి వదలడమే నా లక్ష్యం” అంటూ వర్మ చెప్పిన సమాధానానికి మీడియా సైతం మిన్నకుండిపోయింది.
ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. ఒక టెక్నీషియన్ గా వర్మ స్థాయి దర్శకుడు మన ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలోనే లేడు అనేది అందరు తప్పక ఒప్పుకోవాల్సిన నిజం. అలాంటి వర్మ ఇప్పుడు ఓ ఫిలిమ్ స్కూల్ ను స్థాపించడం అంటే సినిమా మీద అభిమానం, ఆసక్తి ఉన్న ఎందరికో మంచి వారం లాంటిది.