తనని రాజకీయాల్లోకి లాగొద్దంటున్న వరుణ్ తేజ్

రాజకీయాల గురించి తనని అడగ వద్దని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిమానులకు సూచించారు. కొన్ని రోజుల క్రితం ఊటీలో ‘మిస్టర్’ చిత్రం షూటింగ్ లో వరుణ్ కి ప్రమాదం జరిగింది. యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా కాలు విరిగింది. దీంతో ఇంటికే పరిమితమయ్యారు. ఖాళీ దొరకడంతో శుక్రవారం సోషల్ మీడియా వేదికపై ఫ్యాన్స్ తో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు.

మీరు రాజకీయాల్లోకి వస్తారా అని ఒకరు అడగగా .. అటువంటి ప్రశ్నలు తనని అడగవద్దని స్పష్టం చేశారు. వరుణ్ పెద్ద నాన్న మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, కాంగ్రెస్ నాయకుడిగా మారారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ పెట్టి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఏ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. వరుణ్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకే తనని రాజకీయాల్లోకి లాగొద్దని చెబుతున్నారు. కాలి గాయం ఇప్పుడే తగ్గుముఖం పడుతోందని, తాను మామూలుగా నడవడానికి మరో నాలుగు వారాలు పడుతుందని మెగా ప్రిన్స్ ట్విట్టర్లో వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus