దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వెండితెరపై సృష్టించిన అద్భుత కళాఖండం బాహుబలి. ఇందులో బాహుబలి, భల్లాలదేవ, కట్టప్ప పాత్రలతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మరో క్యారక్టర్ శివగామి. ఈ పాత్రలో రమ్యకృష్ణ జీవించారు. అయితే ఈ పాత్ర చేయమని చిత్ర బృందం మొదట అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించింది. ఆ తర్వాత టబు, మంచు లక్ష్మిని కోరింది. వారు ముగ్గురు చేయమని చెప్పారు. ఒక గొప్ప చిత్రంలో మంచి పాత్రను ఎందుకు వదులుకున్నారో శ్రీదేవి, టబులు బయటకు చెప్పలేదు కానీ.. మంచు లక్ష్మి మాత్రం రీసెంట్ గా జరిగిన ఓ షోలో అసలు విషయం బయట పెట్టారు.
“శివగామి క్యారక్టర్ సూపర్. పాత్ర పరంగా నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ప్రభాస్ కి అమ్మగా ..హౌ.. ఎలా చేస్తాను. నాకు ప్రభాస్ తో కొడుకు ఫీలింగ్స్ రావాలి.. వేరే ఫీలింగ్స్ వస్తే తేడా వచ్చేస్తుంది” అంటూ నవ్వుతూ చెప్పారు. ఆ పాత్రను వదులుకున్నందుకు ఎప్పుడూ బాధ పడలేదని, శివగామికి తన వాయిస్ అడిగితే ఇచ్చి ఉండేదాన్నని వెల్లడించారు. “నేను మంచి నటినని రాజమౌళి గారు అనుకుంటే ఈ సినిమాలో కాకపోతే ఇంకో సినిమాలో నాకు మంచి రోల్ ఇస్తారు. శ్రీదేవి గారు, టబు గారు కేటగిరీల్లో నన్ను చేర్చినందుకు ఆయనకు ధన్యవాదాలు” అని మంచు లక్ష్మి వివరించారు.