తెలుగు సినిమా ఇండస్ట్రీకి, నిర్మాతలకు ఏళ్ల తరబడి అతిపెద్ద తలనొప్పిగా మారిన ‘ఐబొమ్మ’ (IBomma) వెబ్ సైట్ నిర్వాహకుడి ఆట కట్టయింది. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉంటూ, పోలీసులకు చిక్కకుండా పైరసీ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ‘ఐబొమ్మ’ అడ్మిన్, ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందింది.
ఇమ్మడి రవి తన ఆపరేషన్ మొత్తాన్ని కరేబియన్ దీవుల్లోని ‘సెయింట్ కిట్స్’ నుండి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని కదలికలపై అంతర్జాతీయ స్థాయిలో నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు, నిన్న (నవంబర్ 14) ఫ్రాన్స్ నుండి భారత్‌కు తిరిగి వచ్చిన సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.
అరెస్ట్‌తో పాటు, ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతాలో ఉన్న సుమారు రూ.3 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ఇది పైరసీ ద్వారా సంపాదించిన మొత్తంగా భావిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఇతను భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ 3 కోట్లు కేవలం కొంత మాత్రమేనని, ఐబొమ్మ ద్వారా అతను వందల కోట్లు ఆర్జించి ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ అరెస్ట్ వెనుక తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల పట్టుదల కనిపిస్తోంది. గతంలో సెప్టెంబర్ 30న, సీపీ సీవీ ఆనంద్ ఒక వివరణ కూడా ఇచ్చారు.. 2 కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలతో ఓ పైరసీ ముఠాను పట్టుకున్నామని, “త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాము” అని గట్టిగా హెచ్చరించారు. ఆ హెచ్చరిక చేసిన నెలన్నరకే ఇప్పుడు ఐబొమ్మ అడ్మిన్‌ను అరెస్ట్ చేయడం విశేషం.
సెప్టెంబర్‌లో పట్టుబడిన ముఠానే ఇండస్ట్రీకి 22 వేల కోట్లు నష్టం కలిగించిందని అంచనా వేశారు. అలాంటిది, తెలుగులో ప్రతీ సినిమాను రిలీజ్ రోజే పైరసీ చేస్తూ నిర్మాతలకు కోట్లలో నష్టం తెస్తున్న ‘ఐబొమ్మ’ మూలస్తంభం కూలిపోవడం అతిపెద్ద పరిణామం. ఇమ్మడి రవి అరెస్ట్‌తో, ‘ఐబొమ్మ’ వెబ్ సైట్ పూర్తిగా మూతపడుతుందా, లేక దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.