IBOMMA: ‘ఐబొమ్మ’ రవి ‘ఎగ్జిట్ ప్లాన్’.. ఆస్తులమ్మేలోపే దొరికాడు!

‘వారణాసి’ ఈవెంట్‌లో ఒక చిన్న డ్రోన్ లీక్ భయానికే రాజమౌళి ఎంత ఆవేదన చెందారో చూశాం. అలాంటిది, రిలీజైన గంటల్లోపే హెచ్‌డీ ప్రింట్లను ఆన్‌లైన్‌లో పెట్టే ‘ఐబొమ్మ’ లాంటి సైట్లు నిర్మాతలకు శాశ్వత నరకంగా మారాయి. ఏటా వందల కోట్లు నష్టపోతున్న ఇండస్ట్రీకి, ఆ పైరసీ భూతానికి అడ్డాగా మారిన ఇమ్మడి రవి అరెస్ట్ అతిపెద్ద ఊరట. ఈ కేసులో ఇప్పుడు కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి.

IBOMMA

ఇమ్మడి రవి సాధారణ పైరసీ దొంగ కాదు, అతను ఒక టెక్నాలజీ నిపుణుడు, సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ. తన టాలెంట్‌ను తప్పుడు దారిలో పెట్టి, కరేబియన్ దీవుల (సెయింట్ కిట్స్) అడ్డాగా ఈ పైరసీ సామ్రాజ్యాన్ని నడిపించాడు. ఇతని కార్యకలాపాల గురించి తమకు ఏమీ తెలియదని కుటుంబ సభ్యులు (తండ్రి అప్పారావు) ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

ఇతను కేవలం భార్యతో విడాకుల కేసు కోసమే ఇండియా వచ్చాడని మొదట వార్తలొచ్చాయి. కానీ, అసలు కథ వేరే ఉందని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. భార్యతో విభేదాల కారణంగా, ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్మేసి, శాశ్వతంగా కరేబియన్‌కు వెళ్లిపోవాలన్నది రవి “ఎగ్జిట్ ప్లాన్” అట. ఈ ఆస్తుల అమ్మకం కోసమే ఇండియాకు వచ్చి, పోలీసులకు చిక్కాడని సమాచారం.

రవి ప్లాన్ మామూలుగా లేదు. అతను 2022లోనే భారత పౌరసత్వం వదులుకుని, రూ.80 లక్షలతో కరేబియన్ పౌరసత్వం పొందాడు. ఇప్పుడు ఇండియాకు వచ్చింది కూడా ఆ ఫారిన్ పాస్‌పోర్ట్‌తోనే. అందుకే, పోలీసులు ఈసారి కేవలం పైరసీ కేసులు కాకుండా, ‘ఫారిన్ యాక్ట్’ను కూడా జోడించారు. ఇది కేసును చాలా సీరియస్‌గా మార్చేసింది.

విశాఖపట్నం, హైదరాబాద్‌లోని ఆస్తులను అమ్మి, తిరిగి కరేబియన్‌కు పారిపోవాలనుకున్న రవి ప్లాన్, ఖాకీల ఎంట్రీతో అడ్డం తిరిగింది. టెక్నాలజీతో ఇండస్ట్రీని ఏమార్చిన టెకీ, ఆస్తుల అమ్మకం కోసం వచ్చి అడ్డంగా దొరికిపోయాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus