IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

తెలుగు ఇండస్ట్రీకి ఏళ్ల తరబడి చుక్కలు చూపించిన ‘ఐబొమ్మ’ (IBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. అరెస్ట్ చేసిన నిందితుడిని పోలీసులు మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపర్చగా, అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో రవిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు, పోలీసులు రవిని 7 రోజుల కస్టడీకి కోరుతున్నారు. ఈ దర్యాప్తులో రవి టెక్నికల్ స్కిల్స్, అతని ఆపరేషన్ విధానం చూసి పోలీసులే షాక్ అయినట్లు తెలుస్తోంది.

IBOMMA

ఈ అరెస్ట్ తర్వాత, పోలీసులు కూకట్‌పల్లిలోని ఇమ్మడి రవి అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించారు. అక్కడ దొరికిన సొత్తు చూసి అధికారులు నివ్వెరపోయారు. ఏకంగా రూ.3 కోట్ల నగదుతో పాటు, వందల కొద్దీ హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేవలం పైరసీ వెబ్ సైట్ నడపడం ద్వారా ఇంత భారీ మొత్తంలో నగదు కూడబెట్టడం ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

అసలు విషయం ఏమిటంటే.. ఇమ్మడి రవి కేవలం పైరసీ చేసే సాధారణ వ్యక్తి కాదు, అతను ఒక హైలీ స్కిల్డ్ హ్యాకర్. ఏ సర్వర్‌నైనా ఈజీగా హ్యాక్ చేయగల టాలెంట్ ఉన్న రవి, ఏకంగా కొత్త సినిమాలు భద్రపరిచే ‘క్లౌడ్’ సర్వర్లనే హ్యాక్ చేసినట్లు తేలింది. నిర్మాతలు సినిమాను స్టోర్ చేసుకునే అఫీషియల్ క్లౌడ్ నుంచే కొత్త సినిమాలను నేరుగా డౌన్‌లోడ్ చేసి, కరేబియన్ దీవుల అడ్డాగా ‘ఐబొమ్మ’లో అప్‌లోడ్ చేసేవాడు.

ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్న రవి, ఫ్రాన్స్ నుంచి రాగానే పోలీసులకు చిక్కాడు. అతని అరెస్ట్‌తో, తెలుగు సినిమాకు అతిపెద్ద పైరసీ గండం గట్టెక్కినట్లేనని నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రవి అరెస్ట్ తర్వాత, పోలీసులు ‘I BOMMA’, ‘BAPPAM’ వెబ్ సైట్‌లను పూర్తిగా బ్లాక్ చేశారు. కస్టడీలో పోలీసులు రవి నుంచి ఇంకెంత సమాచారం రాబడతారు, ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus