ఇదం జగత్

  • December 28, 2018 / 01:02 PM IST

“సుబ్రమణ్యపురం” సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సుమంత్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండానే “ఇదం జగత్” అంటూ మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంతో సుమంత్ ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగాడా లేదా అనేది చూద్దాం..!!

కథ : నిషిత్ విద్యాధర్ (సుమంత్)కు రాత్రి నిద్రపట్టని ఒక విచిత్రమైన రోగం ఉంటుంది. అందువల్ల ఉదయం ఉద్యోగాలు చేయలేక, రాత్రి చేసే ఉద్యోగాలు దొరక్క చాలా ఇబ్బందిపడుతుంటాడు. ఒక సందర్భంలో రాత్రిపూట రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్ ను హనుమంతు (షఫీ) షూట్ చేసి చానల్స్ కి అమ్మడం చూసిన నిషిత్.. తాను కూడా అలాంటి ఉద్యోగమే చూసుకోవాలని ఫిక్స్ అయ్యి ఒక కెమెరా కొనుక్కొని అలాంటి యాక్సిడెంట్ విజువల్స్ షూట్ చేసి చానల్స్ కి అమ్మడం మొదలెడతాడు. కానీ.. తాను అనుకున్న విధంగా సంపాదించలేకపోతాడు. అప్పట్నుంచి క్రైమ్స్ ను షూట్ చేయడమే కాకుండా ఆ క్రైమ్ ను తనకు డబ్బు సంపాదించిపెట్టే విధంగా మలచుకోవడం మొదలెడతాడు. ఈ క్రమంలో ఒక సమస్యలో ఇరుక్కోంటాడు. ఆ సమస్య నుంచి నిషిత్ ఎలా బయటపడ్డాడు అనేది “ఇదం జగత్” కథాంశం.

నటీనటుల పనితీరు : అండర్ ప్లే చేయడంలో సిద్ధహస్తుడైన సుమంత్ ఈ చిత్రంలో రాత్రుళ్లు నిషాచరుడిలా తిరిగే నిషిత్ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. చాలా చోట్ల డైలాగ్స్ కంటే ఎక్స్ ప్రెషన్స్ తోనే భావాలు పలికించాడు. కాకపోతే ఎమోషనల్ సీన్స్ కి మాత్రం న్యాయం చేయలేకపోయాడు.

అంజు కురియన్ కథానాయిక పాత్రకు సరిగా సూట్ అవ్వలేదు. సుమంత్ తో కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అలాగే ఆమె పాత్ర ద్వారా పండాల్సిన ఎమోషన్ కూడా సరిగా ఎక్స్ ఫ్లోర్ అవ్వలేదు. పోలీస్ పాత్రలో శివాజీరాజా, డాన్ క్యారెక్టర్ లో ఆదిత్య మీనన్, స్నేహితుడి పాత్రలో సత్య, చానల్ హెడ్ క్యారెక్టర్ లో ప్రియదర్శిని రామ్ ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు : ముందుగా శ్రీచరణ్ పాకాల సంగీతం గురించి మాట్లాడుకోవాలి. పాటలు కొత్తగా ఉన్నాయి.. నేపధ్య సంగీతం సినిమా జోనర్ కి తగ్గట్లుగా ఉంది. ముఖ్యంగా సౌండ్ డిజైనింగ్ ను మెచ్చుకోవాలి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. దాదాపూ 70% చీకటిలోనే జరిగే ఈ సినిమా విషయంలో లైటింగ్ & ఫ్రేమ్ వర్క్ పరంగా బాల్ రెడ్డి చాలా జాగ్రత్తపడ్డాడు. అందుకు ఆయన అభినందనీయుడు.

“నైట్ క్రాలర్” అనే 2014లో విడుదలైన హాలీవుడ్ ఫిలిమ్ నుంచి మూల కథను తీసుకున్న దర్శకుడు అనీల్.. ఆ కథకు తెలుగు నేటివిటీని జోడించేందుకు చాలా కష్టపడ్డాడు. ప్రధామార్ధం కాస్త పర్వాలేదు అనుకున్నప్పటికీ.. సెకండాఫ్ మాత్రం బాగా సాగదీశాడు. రెండు గంటల నిడివి సినిమా కూడా ఇంకా అవ్వలేదా అని ప్రేక్షకుడు ఫీలయ్యాడంటేనే అర్ధం చేసుకోవచ్చు. నిర్మాణ విలువలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

విశ్లేషణ : ఈ తరహా క్రైమ్ థ్రిల్లర్స్ కి క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్ అనేది చాలా ముఖ్యం. ప్రేక్షకుడు కథతో కాదు,, కథలోని పాత్రతో ప్రయాణం చేయాలి. కానీ.. సుమంత్ క్యారెక్టర్ కి ఎక్కడా ఎస్టాబ్లిష్ మెంట్ కానీ.. జస్టీఫికేషన్ కానీ ఉండదు. ఆ కారణంగా సినిమాలోని మెయిన్ థీమ్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేయలేకపోయింది. సరైన డీలింగ్ కొరవడడంతో “ఇదం జగత్” యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus