ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే సామెతను నిజం చేస్తూ మాలోనే దొంగలున్నారని తెలిసినా ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నామిప్పుడు. పరిశ్రమకి కొత్త నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రావాలి అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది. లేదంటే ఆరు నెలల్లో మూసుకుపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మహా అయితే అయిదారుగురు డిస్ట్రిబ్యూటర్లున్నారు. ఈ విధానం కొనసాగడం చిత్రసీమకు ఏమాత్రం మంచిది కాదు అంటూ ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ పేర్కొన్నారు.
ఆయన నిర్మించిన తాజా చిత్రం “జై సింహా” సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతుంది.
బాలయ్య సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం విడుదల పురస్కరించుకొని మీడియాతో మాట్లాడిన సి.కళ్యాణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చలను ప్రస్తావించడం గమనార్హం. అలాగే క్యూబ్, పిక్సల్లాయిడ్ సంస్థలు కలిసి నిర్మాతలను దోచుకోవడం అనేది తీవ్రమైన సమస్య అని ఇండస్ట్రీలోనే పైరసీ దొంగలున్నారని బెదిరించి మరీ నిర్మాతలను దోచుకుంటున్నారని సి.కళ్యాణ్ పేర్కొనడం చిన్న సైజు సంచలనాన్ని సృష్టించింది. ఒక భారీ నిర్మాత మరియి సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఛాంబర్ హెడ్ అయిన సి.కళ్యాణ్ ఇలా భయపడ్డారంటే.. ఇక చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటో అని ఇండస్ట్రీ వర్గాలు భయపడుతున్నాయి.