‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా చూశారా? అందులో అరటి పళ్లు సీన్ ఉంది గుర్తుందా? సినిమా హీరోల ఫ్యాన్స్‌కి ఆ సీన్ భలే కిక్ ఇస్తుంది. అలా పండింది మరి ఆ సీన్‌లో హీరో – ఫ్యాన్ మధ్య బంధం. అయితే ఆ సీన్ నిజంగా జరిగింది అని తెలుసా? అవును మీరు చదివింది నిజమే. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలోని అరటి పళ్ల సీన్ ‘పిఠాపురం తాలూకా’దట. ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు మహేష్‌బాబు.పి చెప్పుకొచ్చారు.
పిఠాపురం తాలూకా అనేసరికి ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ అరటి పళ్ల సీన్ దర్శకుడు మహేష్‌బాబుకి ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్‌కి మధ్య జరిగిందట. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా ప్రచారంలో భాగంగా మహేష్‌బాబు ఈ విషయం చెప్పుకొచ్చారు. సినిమాలో కథ ప్రకారం రామ్ ఉంటున్న ఊరికి దగ్గరలో ఉపేంద్ర సినిమా షూటింగ్ జరుగుతుంది. తన హీరోకి చిన్న అరటిపళ్లు ఇష్టమని తెలుసుకున్న రామ్ అడ్డంకులు దాటుకుని మరీ తీసుకొస్తాడు. తొలిసారి ఇవ్వడంలో ఫెయిలై, రెండోసారి ఆ సినిమా నిర్మాతకు ఇస్తాడు.
నిజ జీవితంలో ఇక్కడ హీరో ప్లేస్‌లో పవన్ కల్యాణ్ ఉండగా, నిర్మాత ప్లేస్‌లో పవన్ మేనేజర్ ఉన్నారు. రామ్ స్థానంలో మహేష్‌బాబు ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా ఓసారి పవన్ కల్యాణ్ విశాఖపట్నం వెళ్లినప్పుడు తెలిసినవారితో ప్రయత్నాలు చేసి కలవాలని అప్పుడు అక్కడ చదువుకుంటున్న మహేష్‌బాబు.పి ప్రయత్నం చేశారు. అయితే వివిధ కారణాల వల్ల కుదర్లేదు. అయితే ఓ రోజు డిన్నర్ తీసుకెళ్లి పవన్ ఉన్న హోటల్‌కి వెళ్లి ఇవ్వొచ్చు అని తెలిసిందట. అయితే అరటిపళ్లు కావాలి అని ఆయన మేనేజర్ చెప్పారట.
దాంతో మహేష్‌బాబు ఆ రాత్రి విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు తిరగాల్సి వచ్చిందట. ఆ రోజు ఏమైందో కానీ ఎక్కడా అరటి పళ్లు దొరకలేదట. దీంతో నిరాశగా పవన్ ఉన్న హోటల్ వైపు వెళ్తుంటే దారిలో ఓ షాపు మూసేస్తూ కనిపించిందట. వెంటనే కారు దిగి.. ఉన్న రెండు హస్తాల అరటిపళ్లు కొని తీసుకెళ్లారట. ఇదీ అరటిపళ్ల కథ.