టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎం.ఎం కీరవాణి ఒకరు. సంగీత ప్రపంచంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న కీరవాణి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి. తెలుగులో కీరవాణిగా పాపులర్ అయిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ను తమిళంలో మాత్రం మరకతమణి అని హిందీలో ఎం.ఎం. క్రీమ్ అని పిలుస్తారు. శివశక్తి దత్త కుమరుడు కీరవాణి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ప్రతిభ, కష్టాన్ని నమ్ముకున్న కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర రెండు సంవత్సరాలు పని చేశారు.
దాదాపు 60 సినిమాలకు చక్రవర్తి దగ్గర పని చేసిన కీరవాణి ఆ తర్వాత వేటూరి సుందరరామ్మూర్తి దగ్గర శిష్యరికం చేశారు. మనసు మమత అనే సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన కీరవాణి ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. క్షణక్షణం మూవీ తర్వాత కీరవాణికి సినిమా ఆఫర్లు పెరిగాయి. హిందీలో పలు సినిమాలకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు.
200కు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన కీరవాణి కొన్ని సినిమాల్లో పాటలు పాడటంతో పాటు పలు సినిమాలకు పాటల రచయితగా పని చేశారు. కీరవాణి ఒకసారి తన ఇద్దరు కొడుకులను ఫ్యాక్టరీకి తీసుకెళ్లి కూలిపని చేయించారు. పిల్లలకు కష్టం విలువ తెలియాలనే ఉద్దేశంతో కీరవాణి కొడుకులతో కూలిపని చేయించినట్టు సమాచారం.