‘క్రిష్’ (Krish) సినిమా ఫ్రాంచైజీలో నాలుగో సినిమా ఉంటుంది అని చాలా ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘క్రిష్ 3’ (Krrish 3) సినిమా 2013లో వచ్చినప్పటి నుండది ఈ మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఏమైందో ఏమో ఇటు హృతిక్ రోషన్ (Hrithik Roshan) , అటు ఆయన తండ్రి రాకేశ్ రోషన్ ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అయితే సినిమా పనులు బ్యాగ్రౌండ్‌లో శరవేగంగా జరుగుతున్నాయి అని టాక్. ‘వార్ 2’ పనులు అయ్యాక ఆ సినిమా అనౌన్స్ చేస్తారని చెబుతున్నారు.
బాలీవుడ్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న ఇండియన్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’. మానవాతీత శక్తులతో, అబ్బురపరిచే విన్యాసాలతో క్రిష్ మూడుసార్లు ఇప్పటివరకు అబ్బురపరిచాడు. ఈసారి అంటే నాలుగోసారి అంతరిక్షంలో సాహసాలు చేయడానికి సన్నద్ధమవుతున్నాడట. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను కరణ్ మల్హోత్రా తెరకెక్కిస్తారని టాక్. ఇక ఈ సినిమాను రాకేశ్ రోషన్ నిర్మిస్తారు.
అధికారికంగా సినిమాను ప్రకటించకపోయినా చిత్రీకరణను వచ్చే ఏడాది మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని భోగట్టా. ‘వార్ 2’ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరి నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాతే ‘క్రిష్ 4’ (KRRISH 4) పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. దీని కోసం యూరప్‌లో కొన్ని కీలకమైన షెడ్యూల్స్‌ను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. లొకేషన్ల రెక్కీ కూడా పూర్తయింది అని సమాచారం. మరోవైపు ముంబయిలో వివిధ ఫిల్మ్ స్టూడియోల్లో భారీ సెట్లను కూడా సిద్ధం చేశారట.
ఇక ఈ సినిమా కథ సంగతి చూస్తే.. టైమ్ ట్రావెల్, అంతరిక్షం నేపథ్యంలో అత్యాధునిక సూపర్ హీరో కథగా తెరకెక్కిస్తారట. మొదటి మూడు భాగాలకు మించి ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉంటుందని, బాలీవుడ్ సినిమా గురించి మరోసారి దేశవ్యాప్తంగా మాట్లాడుకునేలా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ‘కొయి మిల్ గయా’ (Koi… Mil Gaya) , ‘క్రిష్’, ‘క్రిష్ 3’ వచ్చిన విషయం తెలిసిందే.