ఇంతలో ఎన్నెన్ని వింతలో

నందు, కృష్ణతేజ, త్రిషూల్, నరసింహ, పూజ రామచంద్రన్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం “ఇంతలో ఎన్నెన్ని వింతలో” ఒకరోజులో జరిగే కథాంశంగా తెరకెక్కిన ఈ కామెడీ థ్రిల్లర్ ద్వారా వినాయక్ అసోసియేట్ వరప్రసాద్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. చాన్నాళ్లుగా సరైన రిలీజ్ డేట్ దొరక్క ల్యాబ్ లో ఉండిపోయిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ (ఏప్రిల్ 6) బయటపడింది.

కథ : రాత్రి పార్టీలో పూటుగా తాగేసి ఉదయం లేచేసరికి విష్ణు (నందు), తేజ (నరసింహ), సయ్యద్ (కృష్ణతేజ), ప్రదీప్ (త్రిషూల్) రకరకాల పరిస్థితుల్లో, పరిసరాల్లో ఉంటారు. నిజానికి ఈ నలుగురు కలిసి పార్టీ చేసుకొన్నారు. సాయంత్రం తాను ప్రేమించిన వందన (సౌమ్య వేణుగోపాల్)తో పెళ్లి అనగా.. అసలేం జరిగిందో కూడా గుర్తులేకపోగా, తాము చేసిన తప్పేంటో కూడా తెలియక తికమకపడుతుంటారు ఈ నలుగురు. అప్పుడు కథలోకి ఎంటరవుతాడు నాగోల్ నాని (గగన్ విహారి). అసలు ఈ నలుగురి జీవితాలు ఇలా కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడడానికి కారణం తార (పూజ రామచంద్రన్) అని చెప్పడంతోపాటు.. మరో 2 గంటల్లో తారను తీసుకొచ్చి తనముందు నిల్చోబెట్టకపోతే విష్ణు పెళ్లి కూడా జరగదని బెదిరిస్తాడు.

అసలు తార ఎవరో కూడా గుర్తులేనంతగా తాగేసిన విష్ణు రాత్రి జరిగిన విషయాలను ఎలా రీకలెక్ట్ చేసుకున్నాడు? తన స్నేహితులను ఎలా కాపాడుకోగలిగాడు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడగలిగాడా లేదా? వంటి ప్రశ్నలకు సమాధాన సమాహారమే “ఇంతలో ఎన్నెన్ని వింతలో” చిత్రం.

నటీనటుల పనితీరు : నందు ఎప్పట్లానే తనదైన బాణీలో నటించాడు. అయితే.. నిన్నమొన్నటివరకూ పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినట్లే కనిపించి మాయమైపోయిన కృష్ణతేజ ఈ చిత్రంలో సయ్యద్ పాత్రలో తెలంగాణ యాసలో కడుపుబ్బ నవ్వించాడు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో “కృష్ణతేజ-ఆర్.కె” కాంబినేషన్ కామెడీ ఎపిసోడ్స్ బాగుంటాయి. అలాగే.. “ఫన్ బకెట్” ఫేమ్ త్రిషూల్ మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించాడు. కాకపోతే ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఇంకాస్త పరిణితి చెండాల్సి ఉంది. ఇక పెళ్ళికి ముందే శోభనం చేసుకోవాలని పరితపించే యువకుడిగా నరసింహ పర్వాలేదనిపించుకొన్నా.. అతడు సెక్స్ రాకెట్ లో ఇరుక్కొనే సన్నివేశాలు భలే నవ్విస్తాయి.

హీరోయిన్ సౌమ్య వేణుగోపాల్ అందం, అభినయంతో పెద్దగా ఆకట్టుకోకపోయినా.. పూజ రామచంద్రన్ మాత్రం తార పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఆమె కళ్లలోని మత్తు ప్రేక్షకుడి మనసుకి తాకడం ఖాయం.

అయితే.. తండ్రి, తల్లి పాత్రలకు మరీ సీరియల్ ఆర్టిస్టులను కాకుండా కాస్త ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ ను తీసుకొని ఉంటే బాగుండేది. విలన్ గా గగన్ విహారీ అలరించాడు.

సాంకేతికవర్గం పనితీరు : యాజమాన్య పాటలు, ఆ పాటలకు సురేష్ గంగుల సమకూర్చిన సాహిత్యం బాగున్నాయి. నేపధ్యం సంగీతం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. కథనంలో మంచి స్పీడ్ ఉన్నప్పుడు సరైన బీట్ లేక సీన్ సరిగా ఎలివేట్ అవ్వలేదు. ఎస్.మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. అలాగే.. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

దర్శకుడు కథని మరీ ఎక్కువ మలుపులు తిప్పకుండా సబ్ ఫ్లాట్స్ ఎక్కువ లేకుండా స్క్రీన్ ప్లేతో మాయ చేద్దామనే ప్రయత్నం బాగుంది కానీ.. కథనాన్ని ఇంకాస్త వేగంగా నడిపించి ఉంటే ఫలితం ఇంకాస్త బాగుండేది. అప్పటికీ.. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నప్పటికీ.. రెండు గంటల సినిమాలో కూడా ల్యాగ్ అనిపిస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు మినహా దర్శకుడు వరప్రసాద్ తన ప్రతిభను పర్వాలేదు అనిపించేలా చాటుకొన్నాడు. తదుపరి చిత్రాల విషయంలో స్క్రీన్ ప్లే పరమైన జాగ్రత్తలు తీసుకొంటే మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకొనే లక్షణాలున్నాయి.

విశ్లేషణ : రొటీన్ కమర్షియల్ సినిమాలకంటే కాస్త బెటర్ మూవీ “ఇంతలో ఎన్నెన్ని వింతలో”. కాస్త ల్యాగ్ ను భరించగలిగితే రెండు గంటలపాటు హ్యాపీగా కృష్ణతేజ కామెడీ, పూజ రామచంద్రన్ క్యారెక్టర్, నరసింహ కామెడీ ఎపిసోడ్స్ ను ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటకు రావచ్చు. అయితే.. ‘రంగస్థలం, చల్ మోహన్ రంగ” చిత్రాల తాకిడికి ఈ చిన్న సినిమా నిలవగలుగుతుందా అనేది ప్రశ్నార్ధకం.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus