ఇంటిలిజెంట్

“తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్” వంటి వరుస ఫ్లాపుల అనంతరం సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం “ఇంటిలిజెంట్”. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇటీవల “జై సింహా’తో సూపర్ హిట్ అందుకొన్న సి.కళ్యాణ్ నిర్మించగా.. తేజ్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. ట్రైలర్ మొదలుకొని సాంగ్స్ వరకూ సినిమా మీద ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేయలేకపోయాయి. మరి సినిమా అయినా ఆకట్టుకొందో లేదో చూద్దాం..!!

కథ : సాయిధరమ్ తేజ్ (సాయిధరమ్ తేజ్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తను పని చేసే సంస్థ అభివృద్ధితోపాటు, తన యజమాని సంరక్షణను కూడా బాధ్యతగా భావించి వ్యవహరించే యువకుడు. సాఫ్ట్ వేర్ కంపెనీ ఎం.డి నందకిషోర్ (నాజర్) ఫాలో అవుతున్న పద్ధతుల కారణంగా తమ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతుందని భావించిన ఇతర కంపెనీ ఎండీలందరూ కలిసి ముంబై మాఫియా డాన్ విక్కీ భాయ్ (రాహుల్)ను సంప్రదిస్తారు. చాలా సింపుల్ గా నందకిషోర్ ను చంపేసి అతని కంపెనీని తన పేరు మీద రాయించేసుకొంటాడు విక్కీ భాయ్. తన కంపెనీ ఎండి మాత్రమీ కాక తన ఎదుగుదలకు కారకుడైన నందకిషోర్ ను చంపిన విలన్ గ్యాంగ్ ను చంపడమే ధ్యేయంగా సాయిధరమ్ కాస్తా ధరమ్ భాయ్ గా మారతాడు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి అనేది “ఇంటిలిజెంట్” కథాంశం.

నటీనటుల పనితీరు : ప్రతి సినిమాతో సాయిధరమ్ తేజ్ నటుడిగా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాడు. ఈ సినిమాలోనూ నటుడిగా పర్వాలేదనిపించుకొన్నాడు. అయితే.. డ్యాన్స్ ల విషయంలో మాత్రం రిపీటెడ్ స్టెప్స్ ఎక్కువవుతున్నాయి. “చమక్ చమక్” సాంగ్ లో చిరంజీవిని యాజిటీజ్ గా దింపేయడానికి విశ్వప్రయత్నం చేశాడు. లావణ్య త్రిపాఠికి సినిమాలో నటించడం ఇష్టం లేదో లేక సినిమాలో నటించే సమయంలో ఆరోగ్యం బాలేదో తెలియదు కానీ.. సినిమా మొత్తం చాలా నీరసంగా కనిపిస్తుంది. ఇక “చమక్ చమక్” సాంగ్ లో అమ్మడి డ్యాన్స్ చూస్తుంటే ప్రేక్షకుడికి కూడా నీరసం వచ్చేస్తుంది. రాహుల్ దేవ్, బ్రహ్మానందం, నాజర్, కాశీవిశ్వనాధ్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే లాంటి ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ తెర నిండుగా ఉన్నప్పటికీ వారి పాత్రలకు సరైన ఎస్టాబ్లిష్ మెంట్ లేక, కథనంలో పస లేక ఎవరెందుకు, ఎప్పుడు వస్తున్నారో? ఏం చేస్తున్నారో అర్ధం కాక ప్రేక్షకుడు బుర్ర గోక్కుంటుంటాడు.

సాంకేతికవర్గం పనితీరు : తమన్ తన దగ్గరున్న పాత ట్యూన్స్ అన్నీ కలిపి ఈ సినిమాకి సమకూర్చాడేమో అనిపిస్తుంది పాటలు వింటుంటే. అసందర్భంగా వచ్చే పాటలు చూడ్డానికి బాగోకపోవడంతో పాటలన్నీ సినిమాకి మైనస్ గానే మారాయి. ఎస్.వి.విశ్వేశ్వర్ ఎంత కష్టపడి తన సినిమాటోగ్రఫీలో లొకేషన్స్ ను అందంగా చూపించినా, ఫైట్స్ సీక్వెన్స్ లను బాగా హ్యాండిల్ చేసినా అదంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. గౌతమ్ రాజు గారికి కథ అర్ధం కాలేదో లేక సినిమా ఫస్ట్ కాపీ చూశాక ఏమీ అర్ధం కాలేదో తెలియదు కానీ.. సన్నివేశంతో సన్నివేశానికి సంబంధం లేకుండా అతుకుల బొంతలా అల్లేశారు సినిమాని. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నప్పటికీ.. సినిమా మొదలైన 20 నిమిషాలకే మొదలైన ప్రేక్షకుడి తలపోటు వాటిని ఏమాత్రం కేర్ చేయనివ్వదు. రైటర్ ఆకుల శివగారికి నటించాలి అనే కోరిక ఉంటే మునుపటిలా ఏదైనా చిన్న క్యామియో రోల్ చేస్తే సరిపోయేది. కానీ.. ఆయన రైటింగ్ కంటే యాక్టింగ్ ను సీరియస్ గా తీసుకొని ఆల్మోస్ట్ సెకండ్ విలన్ రోల్ ప్లే చేయడం అనేది ప్రేక్షకుల పాలిట మరణశాసనంగా మారింది. ఆయన తెరపై కనిపించిన, ఎక్స్ ప్రెషన్ లేకుండా డైలాగ్ చెప్పిన ప్రతిసారీ ప్రేక్షకుడి చిరాకు పీక్ స్టేజ్ కి వచ్చేస్తుంది. ఈ విషయాన్ని త్వరగా గ్రహించిన వినాయక్ సెకండ్ ఫైట్ సీక్వెన్స్ లోనే అతడి పాత్రని ముగించడం ఒక్కటే సినిమా మొత్తానికి కాస్త సాంత్వన చేకూర్చే విషయం.

దర్శకుడు వి.వి.వినాయక్ “ఖైదీ నెంబర్ 150” రిలీజై సంవత్సరం అయిపోతున్నా ఇంకో సినిమా చేయలేకపోయాననే కంగారులో “ఇంటిలిజెంట్” కథను ఒకే చేసారేమో అనిపిస్తుంది. వినాయక్ సినిమాలో కథ లేకపోయినా ఎంటర్ టైన్మెంట్ ఉంటుందన్న నమ్మకంతో థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడి నెత్తి మీద మొట్టికాయ కొట్టాడాయన. నిన్నమొన్నటివరకూ వినాయక్ కెరీర్ లో “అఖిల్” బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పుకుంటూ వచ్చినవారందరూ.. “ఇంటిలిజెంట్” కంటే “అఖిల్” చాలా బెటర్ అన్నా అంటారు. ఆ రేంజ్ లో ఉంది సినిమా. 90ల నాటి కథ, అర్ధం పర్ధం లేని కథనం, అన్నిటినీ మించి ఎందుకొస్తాయో అర్ధం కాని పాటలు, ఏం చేస్తున్నాయో తెలియని పాత్రలు. అన్నీ కలగలిసి ప్రేక్షకుడి సహనానికి పెద్ద పరీక్షే పెట్టాయి. వినాయక్ తన మార్క్ ను దారుణంగా మిస్ అయ్యాడు. సినిమా మొత్తానికి సాంగ్స్ కోసం వేసిన భారీ సెట్స్ మినహా ఒక్కటంటే ఒక్క వినాయక్ ట్రేడ్ మార్క్ సీన్ కానీ కామెడీ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ లేకపోవడం గమనార్హం. మారుతున్న సినిమా పంథాతోపాటు వినాయక్ కూడా మారాల్సిన సమయం వచ్చింది. లేదంటే దర్శకుడిగా ఆయన కెరీర్ అటకెక్కిపోతుంది.

విశ్లేషణ : సినిమా క్లైమాక్స్ లో దువ్వాసి మోహన్ డైలాగ్ ఒకటుంటుంది.. “కొందరు పైకి పోయారు, కొందరు పారిపోయారు.. నా పరిస్థితి ఏంటి?” అంటూ సాయిధరమ్ తేజ్ ను దీనంగా అడుక్కోనే సందర్భం ఇంటర్వెల్ లో సగం మంది, ప్రీ క్లైమాక్స్ కి ఇంకొంతమంది థియేటర్ నుండి వెళ్లిపోగా.. ఇంకా ఏదో అద్భుతం జరుగుతుందనో లేక ఒక్క సీన్ లోనైనా నవ్వించకపోతారా అనే పిచ్చి నమ్మకంతో థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకుల మైండ్ సెట్ కు సరిగ్గా సూట్ అవుతుంది. అయితే.. ఆఖరివరకూ కూర్చున్నా కూడా వారికి మిగిలేది పెద్దగా ఏం ఉండదు లెండి.

రేటింగ్ : 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus