బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో సినిమాతో చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన సినిమాల విషయంలో అభిమానులకు, ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉంటాయి. వాటికితోడు ఆయన ఇమేజ్ ఉంటుంది. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సినిమా తెరకెక్కించాలి. ఇందులో ఏది మిస్ అయినా ఇబ్బందే. అందుకే బాలయ్య లాంటి స్టార్ హీరోలతో సినిమా కత్తి మీద సామే అని అంటారు. ఇక బాలయ్య విషయానికొస్తే.. ఆయన హైపర్‌ని సరిగ్గా స్క్రీన్ మీద పోట్రే చేయకపోతే ఇబ్బంది. కొంచెం అటు ఇటు అయినా కష్టమే.
గతంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఏకంగా కెరీర్‌నే ఇరకాటంలో పడేసుకున్న దర్శకుడు ఒకరున్నారు. ఆయనే బి.గోపాల్. బాలయ్యతో ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’ అంటూ వరుస సినిమాలు చేసి, అందులోనూ అన్నీ ఇండస్ట్రీ హిట్‌లు, భారీ హిట్‌లు అందుకున్న కాంబినేషన్ ఆయన. అయితే ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమాతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా నేల విడిచి సాము చేసిన సన్నివేశాలు ఎక్కువయ్యాయి. అతి అయిపోయిందని బాలయ్యే ఓసారి అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి పని చేయలేదు.
ఇప్పుడు, ఇదంతా ఎందుకు అనే డౌట్ రావొచ్చు. ఇటీవల ఆయన, బోయపాటి శ్రీను కలసి చేసిన సినిమా ‘అఖండ 2: తాండవం’ గురించి నడుస్తున్న చర్చలే. ఆ సినిమాలో ప్రకృతికి విరుద్ధంగా, సైన్స్‌లు, దేవుళ్లకు దూరంగా చాలా సన్నివేశాలు ఉన్నాయి. అవన్నీ చూసి బాలయ్యతో ఓవర్ చేయించారు బోయపాటి అనే అనవసర పేరు సంపాదించుకున్నారు. మాస్, ఎలివేషన్ల పేరుతో ఈ ఓవర్ యాక్షన్ సినిమా ఫలితం మీద ప్రభావం చూపించింది అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ మళ్లీ కలసి పని చేస్తారా? అనే డౌట్ రాకూడదు. ఎందుకంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద బాలయ్య, బోయపాటి కాంబో ఉంటుంది అని అంటున్నారు. అందులో బాలయ్యతో బోయపాటి పొరపాటున అతి చేయిస్తే కష్టమే. ఇప్పుడంటే దేవుడి సినిమా అనే యాంగిల్ బాలయ్య ఎన్ని సాధ్యం కాని ఫీట్స్ చేయించినా సరిపోయింది. నార్మల్ కథలో ఇలాంటివి చేస్తే ‘పలనాటి బ్రహ్మనాయుడు’ అవుతుంది.