నవ్వుల రారాజు బ్రహ్మానందం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువకాలం తిరుగులేని హాస్య నటుడిగా చక్రం తిప్పారు. అత్యధిక చిత్రాల్లో నటించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఆయనకుంది. కొత్తతరం హాస్యనటులు వచ్చినప్పుడల్లా బ్రహ్మానందం పని అయిపోయిందని చెప్పేవారు. అయినా తన ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకునే వారు. తన నటనతో నవ్వులు పూయించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆయన్ను మెల్లగా పక్కన పెట్టేస్తున్నారు. ఈ విధానం కొనసాగితే త్వరలోనే బ్రహ్మానందం తెర మరుగు కావడం ఖాయం.
1987 లో అరగుండు యదవగా “అహనా పెళ్లంట” చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన బ్రహ్మానందం.. తొలి చిత్రం ద్వారానే గుర్తింపు పొందారు. అక్కడ నుంచి ప్రతి సినిమాలో విభిన్న పాత్రలు చేస్తూ ఆకట్టుకున్నారు. ఒక దశలో ఆయన లేకుండా ఏ పెద్దహీరో సినిమా ఉండేదికాదు. రోజుకు రూ.4 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నారు. ఏడాదికి ఆయన నటించిన సినిమాలు 20 దాకా రిలీజ్ అయ్యాయి. రెండేళ్ల క్రితం (2014) కూడా బ్రహ్మానందం 19 సినిమాలో కామెడీ పండించారు. 2015 లో 12 చిత్రాలకు పడిపోయారు. ఈ ఏడాది పది చిత్రాల్లో కూడా బ్రహ్మి కనిపించే అవకాశం ఉన్నట్లు లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎలుకా మజాకా, సోగ్గాడే చిన్ని నాయనా, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు చిత్రాల్లో మాత్రమే బ్రహ్మానందం పలకరించారు. అదికూడా కాసేపు మాత్రమే.
ఎలుకా మజాకా ఎప్పుడో తీసింది. ఈ ఏడాది విడుదలైంది. ఇప్పటికే ఆరునెలలు గడిచిపోయినా ఈ సంవత్సరంలో పది కి చేరుకోవాలంటే ఇంకా ఆరు చిత్రాలు చేయాలి. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న ఏ సినిమాలోనూ ఆయన బుక్ కాలేదని తెలుస్తోంది. కమల్ స్వీయ దర్శకత్వం వహిస్తున్న “శెభాష్ నాయుడు” చిత్రంలో మాత్రమే అప్పారావుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఇంటికే పరిమితం అవుతారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.