‘ఓజీ’ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట.. పవన్ కల్యాణ్ తన అభిమానుల కోసం చేసిన సినిమా. పవన్ కల్యాణ్‌తో ఇద్దరు కల్ట్ ఫ్యాన్స్ సుజీత్, తమన్ చేసిన సినిమా. సినిమా రూ.300 కోట్ల వసూళ్ల మార్కు వైపు దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా ఇటీవల సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. అందులో పవన్ కల్యాణ్ స్పీచ్ వింటే రెండు సందర్భాల్లో కొడుకు అకీరా నందన్ పేరు వినిపించింది. ఈ క్రమంలో సినిమా గురించి రెండు కీలక సందర్భాలు బయటికొచ్చాయి.
పవన్ కల్యాణ్‌కు తొలుత సుజీత్ ‘ఓజీ’ సినిమా గురించి చెప్పడానికి వెళ్లినప్పుడు కథ సరిగ్గా చెప్పలేదు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ స్టేజీ మీద చెప్పారు. అయితే కథను ఓ విజువలైజేషన్‌లా చూపించారని.. దానికి సంబంధించిన ఓ డాక్యుమెంట్ ఇచ్చాడని కూడా పవన్ చెప్పారు. ఆ తర్వాత ఈ సినిమా విషయంలో కాస్త సందిగ్ధత నెలకొందని.. దాంతో సినిమా ఆలోచనను కాస్త పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమయంలో ఆ డాక్యుమెంట్‌ను అకీరా నందన్ చూసి ఆసక్తికరంగా ఉందని అన్నాడట.
దాంతో మరోసారి పవన్ కల్యాణ్ సినిమా గురించి ఆలోచించి.. సుజీత్ మనసులో దాగి ఉన్న సినిమా ఆలోచనను పసిగట్టి ఓకే చేశాడు. ఇప్పుడు ఆ సినిమానే రికార్డు స్థాయి వసూళ్లు అందుకుంటోంది. పై విషయం అంతా చదివినప్పుడు అకీరా కారణంగానే ఈ సినిమాను పవన్ చేశాడు అని చెప్పొచ్చు. అక్కడితో ఆగకుండా పవన్ మరో విషయం చెప్పడం గుర్తు చేసుకోవాలి. సినిమా సీక్వెల్ కోసం అకీరా ఆసక్తిగా ఉన్నాడని.. కొన్ని పాత్రలు తిరిగి ఉండేలా చూడాలని అకీరా అంటున్నాడని పవన్ కొన్ని ఇన్‌పుట్స్ కూడా ఇచ్చాడు.
అంటే ఇప్పుడు అకీరా కోసమే ‘ఓజీ 2’ సినిమాను చేయడానికి పవన్ ముందుకొస్తున్నారు అని చెప్పొచ్చు. ఏదైతే ఏముంది పవన్ ఫ్యాన్స్ అయితే రెండో ‘ఓజీ’ వస్తోంది అంటే ఆనందంగానే ఉన్నారు. అంటే ఫ్యాన్స్ కోసం అకీరా ఇదంతా చేశాడా అనే మాట కూడా సరదాగా మాట్లాడుకుంటున్నారు.