కొత్తగా సినిమాలు తీయడం ఓ ఆర్ట్.. అయితే ఆ సినిమాలు సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తీయడం ఇంకా పెద్ద ఆర్ట్. ఈ విషయంలో ప్రశాంత్ వర్మ పీహెచ్‌డీ చేశారనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకు బాగా కొత్తగా అనిపించే విషయాలను చాలా సులువుగా అరటిపండు తొక్క వలిచి ఇచ్చినట్లుగా చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన నుండి ‘హను మాన్’ అనే సినిమా వస్తోంది. మన దేశంలో తొలి, ఏకైక సూపర్ మ్యాన్ హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా టీజర్ చూశాక టాలీవుడ్ వర్గాల్లో ‘మరో రాజమౌళి’ అనే మాట వినిపిస్తోంది.
అయితే ఈ మాట మరీ ఎర్లీ అవ్వొచ్చుకానీ.. ‘మరో రాజమౌళి రెడీ అవుతున్నారు’ అనైతే అనొచ్చు. ఎందుకంటే ‘హను మాన్’ టీజర్ అంత కిక్ ఇచ్చేలా ఉంది మరి. సూపర్ విజువల్స్, అదిరిపోయే కాన్సెప్ట్ అంటూ అభిమానులు దర్శకుడు ప్రశాంత్ వర్మను ఆకాశానికెత్తేస్తున్నారు. ఆ గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్‌కి తెలుగు ప్రేక్షకులకు అవసరమైన ఎమోషన్‌ను పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేస్తే భారీ విజయం పక్కా అంటున్నారు. అయితే ఎంత కాన్‌ఫ్లిక్ట్ కథనైనా ఎమోషన్‌తో మిక్స్ చేయడం ప్రశాంత్ వర్మకు తెలుసు. గత సినిమాల్లో అదే చేసి విజయం సాధించారు కూడా.
ఒకవేళ ‘హను మాన్’ సినిమా విషయంలోనూ అదే జరిగితే పాన్ ఇండియా రేంజికి వెళ్తుంది అంటున్నారు. ఇలాంటి సినిమాలతో పాన్ ఇండియా లెవల్ హిట్ కొడితే.. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ విషయంలో తొలి అడుగు బలంగా వేసినట్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ను స్టార్ట్ చేయాలని చూస్తున్నారాయన. ఈ సూపర్ హీరో సిరీస్‌లో ఇంకో రెండు సినిమాలు కూడా తీయబోతున్నారు ప్రశాంత్ వర్మ. తర్వాతి చిత్రానికి ‘అధీర’ అనే టైటిల్ ఖరారు చేశారు.
దాని తర్వాత ఒక లేడీ ఓరియెంటెడ్ సూపర్ ఉమన్ సినిమా తీస్తారట. ఇవి సక్సెస్ అయితే ఈ యూనివర్స్ ఇంకా కంటిన్యూ అవుతుందట. తేజ లాంటి యంగ్ హీరోతో ‘హను మాన్’ లాంటి సినిమా చేయడం రిస్క్ అనే చెప్పాలి. ఓపెనింగ్స్ విషయంలో కుర్ర హీరోలు అంత ఫుట్‌ఫాల్స్ సాధించలేరు. అయితే ఈ రోజుల్లో కాన్సెప్ట్ బాగుంటే.. రెండో ఆటకే జనాలు క్యూ కడుతున్నారు. మరి ప్రశాంత్ వర్మ ‘హను మాన్’తో ఏం చేస్తారో చూడాలి. ముందుగా చెప్పినట్లు అంచనాలను అందుకుంటే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపడం ఖాయం.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!