‘బాహుబలి’ తర్వాత కీరవాణి రిటైర్ అవుతానని ప్రకటించినా, రాజమౌళి మాత్రం ఆయన్ను వదల్లేదు. ‘RRR’తో ఏకంగా ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఇక కీరవాణి ఇప్పుడు రెమ్యునరేషన్‌తో సంబంధం లేకుండా, చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే రాజమౌళి తన అన్నయ్యతో పాటు నెక్స్ట్ తన సినిమాల కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను సిద్ధం చేస్తున్నారా అనే పాయింట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. SSMB29 నుంచి వచ్చిన హింట్ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
కీరవాణి టాలెంట్‌ను రాజమౌళి వాడుకున్న స్థాయిలో, మరే దర్శకుడూ వాడుకోవట్లేదనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. జక్కన్న సినిమాలకు కీరవాణి ఇచ్చే సోల్, ఎమోషన్ వేరు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు (SSMB29) కీరవాణితో పాటు, ఆయన తనయుడు కాలభైరవ కూడా పనిచేస్తున్నట్లు హింట్ ఇచ్చాడు. ఇటీవల మౌగ్లీ 2025 సినినా ఫస్ట్ సాంగ్ లాంచ్ లో భైరవ తన కాంట్రిబ్యూషన్ కాస్త ఉండబోతున్నట్లు చెప్పాడు.
ఇది ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. కాలభైరవ కాంట్రిబ్యూషన్ ఏంటి? కేవలం సాంగ్ రికార్డింగ్‌లో సహాయం చేయడమా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? ఏదేమైనా రాజమౌళి ఆలోచనలు చాలా దూరదృష్టితో ఉంటాయి. తన విజన్‌ను అందుకోగల మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను ఆయన సిద్ధం చేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ వారసుడు కాలభైరవ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే భైరవ కొన్ని చిన్న సినిమాలకు మ్యూజిక్ అందించాడు, కానీ అంతకుమించి అతనికి ఆఫర్స్ అయితే రావడం లేదు. ఇక జక్కన్న సినిమాల్లో కాలభైరవ కేవలం సింగర్‌గా మాత్రమే లేడు. ప్రతి సినిమా మ్యూజిక్ విభాగంలో తండ్రితో పాటు భాగం అవుతున్నాడు. కానీ పూర్తి బాధ్యతలు మాత్రం రాలేదు. ‘బాహుబలి’లో “దండాలయ్యా”, ‘RRR’లో ఆస్కార్ విన్నింగ్ సాంగ్ “నాటు నాటు” పాడింది ఆయనే. రాజమౌళి ఎమోషనల్ పల్స్, మాస్ పల్స్ రెండూ కాలభైరవకు బాగా తెలుసు.
ఇప్పుడు SSMB29 లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లో కీరవాణి పర్యవేక్షణలోనే కాలభైరవకు ఓ బాధ్యత అప్పగించడం ద్వారా, జక్కన్న తన భవిష్యత్ ప్రాజెక్టులకు అతన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్నాడన్నమాట. కీరవాణి ఎలాగూ ఉంటాడు అలాగే ఆయనకు సపోర్ట్ గా భైరవకు కూడా రంగంలోకి దించితే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు టాక్. మహేష్ సినిమాకు కాలభైరవ ‘చిన్న కాంట్రిబ్యూషన్’ అని చెబుతున్నా, ఇది రాబోయే భారీ బాధ్యతలకు ఒక ట్రయల్ రన్ లాంటిది. తండ్రి నుంచి బాధ్యతలు అందుకుని, రాజమౌళి నెక్స్ట్ జనరేషన్ సినిమాలకు కాలభైరవ ఆస్థాన సంగీత దర్శకుడిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.