‘కేజీయఫ్‌ 3’లో రానా?

‘కేజీయఫ్‌ 2’ ఆఖరులో ‘కేజీయఫ్‌ 3’ గురించి లీక్‌ ఇచ్చేసి వదిలేశారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. కథేంటి, కాన్సెప్ట్‌ ఏంటి, కాస్ట్‌ ఏంటి, క్రూ ఏంటి అనేది తర్వాత చూద్దాం అని ఆయన అనుకున్నట్లున్నారు. అయితే ఫ్యాన్స్‌ మాత్రం కాస్ట్‌ అండ్‌ క్రూని అప్పుడే సెలక్ట్‌ చేసే పనిలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే సినిమా కథను వండేస్తుంటే, మరికొందరేమో వీళ్లు నటిస్తున్నారు, వాళ్లు నటిస్తున్నారు అంటూ లెక్కలేసేస్తున్నారు.

‘కేజీయఫ్‌’ సినిమాల సిరీస్‌లో హీరో ఎంత ఫేమసో, విలన్లు కూడా అంతే ఫేమస్‌. సినిమాలో హీరో యశ్ అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. దీంతో విలన్‌ ఎవరు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇప్పుడు దాని గురించే చర్చంతా జరుగుతోంది. తొలి రెండు పార్టుల్లో విలన్లు మొత్తం చనిపోయారు. ఆ మాటకొస్తే హీరో కూడా చనిపోయాడు అనుకోండి. కానీ మూడో పార్టు కోసం హీరోను ఎలాగోలా బతికిస్తారు. అప్పుడు విలన్‌ కావాలి.

ఆ విలన్‌ రానా దగ్గుబాటి అంటున్నారు నెటిజన్లు. దీనికి కారణం సినిమా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల రానాకి ట్విటర్‌లో ఇచ్చిన రిప్లైనే. ‘కేజీయఫ్‌ 2’ను పొగుడుతూ రానా ట్వీట్‌ చేస్తే దానికి ప్రశాంత్‌ రిప్లై ఇచ్చారు. అందులో త్వరలో కలుద్దాం అంటూ రాశారు. రానాని ప్రశాంత్‌ ఊరికనే ఎందుకు కలుస్తాడు. సినిమా గురించే కదా. అది ‘కేజీయఫ్‌ 3’ కోసమే అంటూ లెక్కలేసేస్తున్నారు. ‘సలార్‌’కి సంబంధించి ఎలాగూ కాస్ట్‌ ఎంపిక అయిపోయింది.

ఇక ప్రశాంత్‌ నుండి ఉన్నవి రెండు సినిమాలే ఒకటి ‘కేజీయఫ్‌ 3’ అయితే రెండోది తారక్‌ సినిమా. తారక్‌ సినిమా మల్టీస్టారర్‌ అయితే కాదు. ఇప్పటివరకు అలాంటి ప్రచారాలు ఏమీ లేవు. కాబట్టి రానా – ప్రశాంత్‌ కలయిక ‘కేజీయఫ్‌ 3’ కోసమే అంటున్నారు నెటిజన్లు. అయితే మరి ప్రశాంత్‌ మనసులో ఏముంది అనేది ఆయనే తెలియాలి. చూద్దాం త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందేమో. అప్పటివరకు ఇంకొన్ని పుకార్లు ఇలానే వస్తుంటాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus