టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’ విడుదల పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో రాంచరణ్ హీరోగా వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రం తప్ప మరే పెద్ద చిత్రం రాలేదు. ఇప్పటి వరకూ ‘ఎఫ్2’ ‘118’ చిత్రాలు తప్ప మరే చిత్రం హిట్టవ్వలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ‘మహర్షి’ చిత్రం పైనే ఉంది. అయితే ఓవర్సీస్లో మాత్రం ‘మహర్షి’ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయ్యర్లు భయపడుతున్నారట. దీనికి ముఖ్య కారణం ‘మహర్షి’ చిత్రం స్టోరీ లైన్ కాస్త ‘శ్రీమంతుడు’ చిత్రానికి దగ్గరగా ఉండడమే అని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
విషయాన్ని పరిశీలిస్తే… ‘శ్రీమంతుడు’ చిత్రంలో హీరోయిన్ వలన తన సొంత ఊరు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఊరిని బాగుచేస్తాడు. ఈ చిత్రంలో కూడా తన స్నేహితుడు(అల్లరి నరేష్) వలన ఓ పల్లెటూరికి వచ్చి… ఆ ఊరిని ఉద్దరించడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి అదే స్టోరీ లైన్… అవే కమర్షియల్ ఎలెమెంట్స్ తో కూడిన చిత్రాన్ని అక్కడ జనం ఆదరించరనే ఉద్దేశంతో ఓవర్సీస్ బయ్యర్లు భయపడుతున్నారట. ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని 18 కోట్లు పెట్టి కొన్న బయ్యర్స్ ఈ చిత్రానికి కేవలం 12 కోట్లు మాత్రమే పలుకుతున్నారట. అది కూడా మహేష్ చిత్రం కాబట్టి మాత్రమే. దిల్ రాజు చిత్రాలు అక్కడ పెద్ద మొత్తంలో కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు భయపడుతుంటారు.. అనేది అందరికీ తెలిసిన సత్యమే. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!