2019 ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు, చాలా చర్చనీయాంశం అయ్యాయి. ‘జనసేన’ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కనీసం 20 నుండీ 30 సీట్లు సాధించి సీఎం అయ్యే అవకాశాలు వస్తాయని.. అయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ పవన్ ఘోర పరాజయం పాలవ్వడం అందరినీ ఆలోచనల్లోకి గెంటేసింది. మరో పక్క టీడీపీ ప్రభుత్వం కూడా ఏమాత్రం రాణించలేదు. కనీసం 30 సీట్లు కూడా రాకుండా చతికిల పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఒక్కడే తెలుగుదేశం పార్టీని ఆదుకోగలదని రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
అయితే సినీ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లోకి అడుగు పెడితే ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనేది చిరంజీవి, పవన్ కళ్యాణ్ చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళంలో కమల్ హాసన్ కు కూడా ఇదే చేదు అనుభవం ఎదురైంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా అనేది.. కాస్త ఆలోచించాల్సిన విషయమే..! ఒకవేళ ఎన్టీఆర్ కు అలాంటి ఆలోచన ఉన్నా పవన్ కళ్యాణ్ లాంటి నెంబర్ వన్ హీరోని చూసిన తరువాత ఆలోచన మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని కొందరి వాదన. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలంటూ వేల సంఖ్యలో జూనియర్ కు మెసేజ్ లు వస్తున్నాయట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..!