Amazon Prime: అమెజాన్ ప్రైమ్ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..
- July 1, 2026 / 03:30 PM ISTByFilmy Focus Desk
మా దగ్గర సినిమా చూడాలి అంటే ఇంత డబ్బులు కట్టండి అని అన్నారు తొలి రోజుల్లో. ఆ తర్వాత మీరు డబ్బులు కట్టినా ఈ సినిమా కోసం ఇంకాస్త డబ్బులు కట్టాలి అన్నారు. ఇప్పుడు మీరు డబ్బులు కట్టినా యాడ్స్ చూపిస్తాం. అవి కూడా వద్దంటే ఇంకా డబ్బులు కట్టాలి అని అంటున్నారు. ఇదీ చాలా ఓటీటీల ప్రస్తుత పరిస్థితి. ఒక్కో వీడియోలో మధ్యన మూడేసి, నాలుగేసి యాడ్స్ వచ్చేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. సోషల్ మీడియాలో ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియాలో మాత్రం ఈ విషయంలో ఊరుకోలేదు. కోర్టు మెట్లు ఎక్కి అమెజాన్ ప్రైమ్‌ని చిక్కుల్లో పడేశారు.
Amazon Prime
ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ (ఏసీసీసీ) ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఫెడరల్ కోర్టులో అమెజాన్‌పై దావా వేసింది. వార్షిక ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఒప్పందాల్లో అమెజాన్ ఏక పక్ష నిబంధనలు పెట్టిందని, వినియోగదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సేవల్లో మార్పులు చేసిందని కన్జ్యూమర్ కమిషన్ ఆరోపించింది. ఈ మార్పుల వల్ల ఆస్ట్రేలియాలో 10 లక్షల మంది చందాదారులు ఎఫెక్ట్ అయ్యారని తెలిపింది. ఆస్ట్రేలియాలో 2024 నుండి ప్రైమ్ ప్రకటనలను ప్రారంభించింది.
ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి రూల్స్ పెట్టడం.. ముందస్తుగా సబ్‌స్క్రిప్షన్ చెల్లించిన వినియోగదారులకు అన్యాయం చేయడమేనని కోర్టుకు ఏసీసీసీ వివరించింది. ఈ వ్యవహారంపై వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కమిషన్ కోరింది. ఈ కేసు విషయంలో దర్యాప్తునకు సహకరిస్తామని అమెజాన్ టీమ్ చెబుతోంది. మరి ఆస్ట్రేలియాను ఆదర్శంగా తీసుకొని ఇతర దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ ప్రపంచం మొత్తం ఇలా యాడ్స్ తీసుకొచ్చింది. అయితే ఈ విషయంలో కోర్టు తీర్పు బట్టి మొత్తం పరిస్థితులు మారనున్నాయి అని చెప్పొచ్చు.












