సంచనలమని అంచనాలు పెంచేస్తున్నారు..!

మామూలుగానే అగ్ర హీరోల సినిమాల అంచనాలు భారీగా ఉంటాయి. అందునా గత సినిమా ఫలితం, హిట్ కాంబినేషన్ లో సినిమా అంటే అవి అలా అలా పెరిగి శిఖర స్థాయిని చేరుకుంటాయి. ఇలాంటి సందర్భం ఎదురైనపుడు సాధారణంగా ఎవరైనా “గత సినిమాలనే ఇదీ బావుంటుందనో, మరోటనో” చెప్పి అంచనాల కొండెక్కిన వారిని కాస్త కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ అంచనాలు అందుకుంటే పర్లేదు. అదే ప్లేట్ తిరగబడిందో పెట్టుబడులు కూడా వెనక్కిరావు. అయితే ఇవేవీ పట్టనట్టు కొరటాల తన తాజా సినిమాపై తనకు తానే అంచనాలు పెంచే పనిలో పడ్డారు.

మహేశ్ బాబు – కొరటాల శివ కలయికలో తెరకెక్కిన తొలి చిత్రం ‘శ్రీమంతుడు’ నేల క్లాస్ వారినుండి సోఫా సీట్ ప్రేక్షకుల వరకూ అందరినీ మెప్పించి 100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. అంతటి ఘన విజయం సాధించిన తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రానుందన్న విషయం బయటకు రాగానే “ఈ సినిమా శ్రీమంతుడిని మించిపోతుంది, రెండొందలు కోట్లు వసూళ్ళని” అభిమానులు హడావిడి చేయటం మొదలెట్టారు. ఇది సరిపోదన్నట్టు నిన్న సినిమా ఓపెనింగ్ లో కొరటాల అండ్ కో కూడా ఇదే తీరున స్పందించారు. కథ పరంగా ఈ సినిమా ‘శ్రీమంతుడు’ని మించి ఉంటుందన్న శివ, తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందని చెప్పుకొచ్చారు. మహేశ్ తో ఎప్పటినుండో సినిమా చేయాలని కాపుగాసిన నిర్మాత డీవీవీ దానయ్య కూడా తక్కువ తినలేదు. ‘మహేశ్ తో ఓ సంచలన చిత్రం చేయాలన్న కోరిక తీరిందని’ స్టేట్మెంట్ ఇచ్చారు.

సినిమాకి పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల బట్టి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. ఈ సినిమాకి కూడా ప్రముఖ సినిమాటొగ్రాఫర్ రవి కె చంద్రన్ పనిచేయనుండగా, కొరటాల తొలి చిత్రం నుండి తనతో ప్రయాణం చేస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాతోనూ ఆయనతో కొనసాగుతున్నారు. ఇంత భారీ కాంబినేషన్ లో రానున్న సినిమాపై ఈ స్థాయిలో అంచనాలు పెంచడం ఎంతవరకు సబబు..? ప్రస్తుతం హీరోయిన్ కోసం గాలిస్తున్న కొరటాల, మురుగదాస్ సినిమా పూర్తి చేసి మహేష్ వచ్చేనాటికి సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని టీమ్ కి పురమాయించారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus