Itlu Mee Yedava Review in Telugu: ఇట్లు మీ ఎదవ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • త్రినాథ్ కటారి (Hero)
  • సాహితీ అవంచ (Heroine)
  • దేవీప్రసాద్, గోపరాజు రమణ, తనికెళ్ళ భరణి, సురభి ప్రభావతి, మధుమణి తదితరులు (Cast)
  • త్రినాథ్ కటారి (Director)
  • బళ్లారి శంకర్ (Producer)
  • ఆర్.పి.పట్నాయక్ (Music)
  • జగదీష్ చీకటి (Cinematography)
  • ఉద్ధవ్ ఎస్.బి (Editor)
  • Release Date : నవంబర్ 21, 2025
  • సంజీవని ప్రొడక్షన్స్ (Banner)

త్రినాథ్ కటారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ, హీరోగా నటించిన చిత్రం “ఇట్లు మీ ఎదవ”. పూరి జగన్నాథ్ సినిమాలా క్యాచీగా ఉన్నా ప్రేక్షకులు కాస్త జంకే టైటిల్ ఇది. ప్రమోషనల్ కంటెంట్ ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ.. క్వాలిటీ మాత్రం బాగుంది. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

Itlu Mee Yedava Movie Review

కథ: ఉదయం 9 గంటలకి కానీ నిద్ర లేచే అలవాటు లేక.. ఆరేళ్ల నుండి పీజీ చదువుతున్న మధ్య వయస్కుడు శ్రీనుబాబు (త్రినాథ్ కటారి).. అదే కాలేజ్ లో పీజీ సెకండ్ ఇయర్ చదవడానికి వచ్చిన మనస్విని (సాహితీ)ని తొలిచూపులోనే ఇష్టపడి.. ఆమెను ప్రేమలో పడేయడానికి నానా ఇబ్బందులు పడుతుంటాడు.

కట్ చేస్తే.. అమ్మాయి ప్రేమను సంపాదించినా.. ఆమె తండ్రి (దేవీప్రసాద్) అంగీకారాన్ని మాత్రం పొందలేకపోతాడు. దాంతో.. నెల రోజులపాటు శ్రీనుబాబుతో ఉండి, అతడ్ని అల్లుడిగా అంగీకరించాలా లేదా అనే విషయాన్ని డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఆ టెస్టులో శ్రీనుబాబు పాసయ్యాడా? తన ప్రేమను గెలిపించుకున్నాడా? అనేది “ఇట్లు మీ ఎదవ” కథాంశం.

నటీనటుల పనితీరు: త్రినాథ్ లో మంచి చలాకీతనం ఉంది. ఇడియట్ రోజుల్లో రవితేజను గుర్తుచేశాడు. డైలాగ్ డెలివరీ & ఎక్స్ ప్రెషన్స్ విషయంలో చాలాచోట్ల రవితేజను ఇమిటేట్ చేసినట్లుగా కూడా ఉంటుంది. అయితే.. ఆ ఎక్స్ ప్రెషన్స్ కూడా రిపిటీటీవ్ గా ఉండడం వల్ల.. చాలా సన్నివేశాలు పండలేదు కూడా. అయితే.. అతడికున్న ఎనర్జీకి నటుడిగా స్థిరపడే స్కోప్ మాత్రం పుష్కలంగా ఉంది.

సాహితీ స్వచ్ఛమైన తెలుగమ్మాయి కావడంతో.. లిప్ సింక్ ఇష్యూస్ లేకుండా మంచి తెలుగు మాటలు మాట్లాడుతూ, తెలుగులోనే భావాలు పలికిస్తూ ఆకట్టుకుంది.

డైరెక్టర్ టర్నడ్ యాక్టర్ దేవీప్రసాద్ కు చాన్నాళ్ల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. తనదైన సీనియారిటీతో పాత్రకు గౌరవం తీసుకొచ్చారాయన. ఓ సగటు తండ్రి పడే మనోవేదనను, ఓ సగటు వ్యక్తి అనుభూతి చెందే చిన్ని చిన్ని ఆనందాల్ని చాలా హుందాగా పండించారు.

గోపరాజు రమణ మెల్లమెల్లగా కోటా శ్రీనివాసరావు లేని లోటు తీరుస్తున్నారు. పాత్రల ఎంపికలో ఇంకాస్త వైరెటీ చూపించగలిగితే ఆయన్ని చిత్రసీమ కచ్చితంగా కోట శ్రీనివాసరావుకి ప్రత్యామ్నాయంగా స్వీకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సురభి ప్రభావతి, మధుమణి, తనికెళ్లభరణి రెగ్యులర్ టెంప్లేట్ రోల్స్ లో పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాకి దర్శకుడు, కథానాయకుడు, రచయిత అయిన త్రినాథ్ కటారి.. ఇడియట్ లాంటి హీరో బొమ్మరిల్లు సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో సింగిల్ పాయింట్ గా స్టోరీని బానే అల్లుకున్నాడు. ముఖ్యంగా సినిమాని ముగించిన విధానం కూడా బాగుంటుంది. అయితే.. మధ్యలో వచ్చే సందర్భాలు మాత్రం బోరింగ్ గా ఉంటాయి. అందువల్ల.. కామెడీ కూడా ఆల్రెడీ చూసేసాం కదా అని భావనతో పెద్దగా నవ్వు కూడా రాదు. ఆ సందర్భాలను కాస్త కొత్తగా తెరకెక్కించి ఉంటే బాగుండు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లేలో చాలా లొసుగులు ఉన్నాయి. పెద్దగా లాజిక్స్ అని కాదు కానీ.. మరీ ఇష్టానుసారంగా నడపకుండా ఉంటే బాగుండేది. గుడిలో వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఏమైపోయారో కూడా తెలియదు. అక్కడితో వాళ్ళ డేట్స్ అయిపోయాయో లేక ఎడిటింగ్ లో క్లారిటీ లేక కట్ చేసేసారో అర్థం కాలేదు. ఇలా చాలా లోట్లున్నాయి. అయితే.. సీజన్డ్ ఆర్టిస్టులైన దేవీప్రసాద్, గోపరాజు రమణ ఆ లొసుగుల్ని కాస్త కవర్ చేయడానికి ప్రయత్నించారు.

ఆర్పీ పట్నాయక్ పాటలు ఇంకా పాత ఫార్మాట్ లోనే ఉన్నాయి. ఆయన పాత సినిమాలు గుర్తుకొస్తాయి.

సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి ఈ సినిమాకి స్పెషల్ ఎస్సెట్ అని చెప్పాలి. సినిమా అంత క్వాలిటీగా కనిపించింది అంటే కారణం జగదీష్. కలరింగ్ విషయంలో కూడా మంచి కేర్ తీసుకున్నాడు. లిమిటెడ్ లొకేషన్స్ లో రిపీట్ ఫీల్ కలగకుండా జాగ్రత్తపడ్డాడు. ఆర్ట్ & ప్రొడక్షన్ డిజైన్ టీమ్స్ మంచి ఎఫర్ట్స్ పెట్టారు.

విశ్లేషణ: మనకి ఉన్నదే ఏడెనిమిది కథలు. వాటిలోనే వివిధమైన కోణాల్లో కథనాన్ని నడిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవాళ్లే సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు. పాత కథను కొత్తగా చెప్పడంలోనే మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ ను మ్యానేజ్ చేయడంలో త్రినాథ్ కటారి తడబడ్డాడు. సీన్ కంపోజిషన్ ఎంత ముఖ్యం అనేది విస్మరించాడు. అందువల్ల.. ఓవరాల్ గా సినిమాలో కంటెంట్ ఉంది అనే భావన కలిగినప్పటికీ.. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అలరించకపోవడంతో, సినిమా బోర్ కొడుతుంది. డైలాగ్స్ ఎంత వాడుక భాషలో.. సింపుల్ గా ఉండాలి అనుకున్నప్పటికీ.. అర్థవంతంగా, ఎమోషనల్ గా ఉండాలి అనేది త్రినాథ్ సీరియస్ గా తీసుకోకపోవడం అనేది మరో మైనస్.

ఫోకస్ పాయింట్: కాస్త కొత్తగా చెబితే బాగుండు!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus