బాలీవుడ్ విలక్షణ నటుడు జాకీ ష్రాఫ్… నటనలోనే కాదు, నిజ జీవితంలోనూ ఆయన అంతే విలక్షణంగా ఉంటారు. తాజాగా ఆయన ఓ సినిమా దర్శకుడికి ఇచ్చిన గిఫ్ట్ చూసి మరోసారి ఈ మాట గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. చాలా మంది హీరోలు తమతో సినిమా చేస్తున్న, చేసిన దర్శకులకు, ఆ టీమ్‌కి గిఫ్ట్‌లు ఇస్తుంటారు. కోలీవుడ్‌లో ఎక్కువగా కనిపించే ఈ ట్రెడిషన్.. ఇటీవల మిగిలిన ఇండస్ట్రీలకూ వ్యాపించింది. అయితే ఓ నటుడు దర్శకుడికి గిఫ్ట్ ఇవ్వడం ఇటీవల జరిగింది.
ఇచ్చింది జాకీ ష్రాఫ్ అయితే పుచ్చుకుంది దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. హీరోలు తమ రేంజ్‌కి తగ్గట్టుగా కోట్ల రూపాయల కార్లు, ఖరీదైనర వాచీలు, బ్రాస్లెట్లు ఇస్తుంటారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కి… బాలీవుడ్ సీనియర్ యాక్టర్ జాకీ ష్రాఫ్ డిఫరెంట్ గిఫ్ట్ ఇచ్చారు. అదే ఓ స్కూటర్. ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ మీరు చదివింది నిజమే. ఆయన ఇచ్చిన గిఫ్ట్ స్కూటరే. పసుపు రంగు వెస్పా స్కూటర్‌ను డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కు జాకీ ష్రాఫ్ బహుమతిగా ఇచ్చారు.
ఈ మేరకు ఆ విషయాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే స్కూటీ గిఫ్ట్‌గా ఎందుకు ఇచ్చారు అనేది మాత్రం ఆయన చెప్పలేదు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్’ అనే సినిమా చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అందులో జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ సినిమాలో పాత్రకు, ఈ స్కూటీకి ఏమైనా అనుబంధం ఉందా? లేక నెల్సన్ దిలీప్‌కి, స్కూటీకి ఏమైనా రిలేషన్ ఉందా అనేది తెలియాలి.
అన్నట్లు ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇతర ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా, సునీల్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి వాళ్లు కూడా ఏమైనా గిఫ్ట్‌లు ఇస్తారేమో చూడాలి.