జగపతిబాబు మనకు హీరోగా, క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా మాత్రమే తెలుసు. ఇటీవల ఓ టీవీ షో చేస్తుండటతో హోస్ట్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ షోను ఇప్పుడు ఆసక్తిగా రన్ చేస్తున్నారు కూడా. అయితే ఆయనలో మనకు తెలియని మరో కోణం ఉంది. అదే డిస్ట్రిబ్యూటర్. అవును ఆయన గతంలో కొన్ని సినిమాలకు పంపిణీదారుడిగా వ్యవహరించారు. అయితే నేరుగా కాకుండా తన స్నేహితులతో కలసి ఆ బిజినెస్ కూడా చేసేవారు. ఈ క్రమంలో చాలా వరకు నష్టాలు ఎదుర్కొన్న ఆయన.. ఓ సినిమాతో మాత్రం మూడు రెట్ల లాభం పొందారట.
ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాను జగపతిబాబు ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి సినిమాల ప్రస్తావన వచ్చింది. అలాగే ప్రభు తొలి సినిమా ‘ప్రేమికుడు’ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆ సినిమా సమయంలో ప్రభుదేవా మీద వచ్చిన విమర్శలు, ఆ తర్వాత సినిమా సాధించిన భారీ విజయం గురించి కూడా చర్చించుకున్నారు. అప్పుడే జగపతి బాబు డిస్ట్రిబ్యూటర్ యాంగిల్ బయటకు వచ్చింది.
‘ప్రేమికుడు’ సినిమాను ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్‌ను స్నేహితులతో కలిపి జగపతిబాబు తీసుకున్నారట. దీని కోసం ఆ రోజుల్లో తన వాటాగా రూ.2 లక్షలు పెట్టారట. ఆ సినిమా విడుదల సమయంలో వైజాగ్‌లో ఓ హోటల్‌లో ఉండి.. ఎదురుగా ఉన్న థియేటర్‌కు జనాలు వస్తారా, రారా అనేది అనుమానం అనుమానంగా చూశారట. చాలా తక్కువమంది ఊహించినట్లుగా జనాలు తండోపతండాలుగా వచ్చి సినిమాను హిట్ చేశారని జగపతి చెప్పారు. ఈ క్రమంలో తనకు రూ.6లక్షలు వచ్చిందని తెలిపారు.
ఆ నెలలో తన హిట్ సినిమా ‘శుభలగ్నం’ కూడా వచ్చిందని.. కానీ తాను మాత్రం ‘ప్రేమికుడు’ సినిమా ఫలితం గురించే ఆలోచించాను అని జగపతి బాబు చెప్పారు. అంతేకాదు అప్పటివరకు చాలా సినిమాలకు అలా పెట్టిన డబ్బులు పోయాయని.. ఈ ఒక్క సినిమాకు మాత్రమే వెనక్కి వచ్చాయని, లాభం కూడా వచ్చిందని తెలిపారు.