పండోరా గ్రహం అంటూ.. 13 ఏళ్ల క్రితం ప్రపంచ సినీ ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించారు జేమ్స్ కామెరూన్. ‘అవతార్’ అంటూ ఆయన తీసుకొచ్చిన ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ దక్కింది. సినిమాను ఇలా కూడా తీయొచ్చా, ప్రేక్షకులు ఇది కలనా, నిజమా అంటూ కళ్లు నులుముకునేలా చేశారు ఆ సినిమాతో కామెరూన్. ఆ సినిమా విడుదలయ్యాక దీనికి నాలుగు సీక్వెల్స్ ఉంటాయి అని కూడా ప్రకటించారు. అందులో రెండో సీక్వెల్ వచ్చే నెల విడుదలవుతోంది.
అయితే ఈ నేపథ్యంలో జేమ్స్ కామెరూన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ జనాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. అవతార్ సిరీస్‌లో ఇది రెండో చిత్రమనే విషయం తెలిసిందే. సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్‌లాంగ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు, వీడియోలు చూస్తే మరో కొత్త ప్రపంచంలోని మనం వెళ్తామనే అంచనాలు అయితే ఉన్నాయి.
అయితే ఈ సినిమా ఫలితం మీదే మిగిలిన మూడు సీక్వెల్స్ ఆధారపడి ఉన్నాయి అంటున్నారు జేమ్స్ కామెరూన్. ముందుగా చెప్పినట్లు ‘అవతార్’కి మూడు, నాలుగు, ఐదు అంటూ ఇంకా మూడు భాగాలూ ఉంటాయని దర్శకుడు జేమ్స్ కామెరూన్ గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా.. ‘ఒకవేళ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ విజయం సాధించకపోతే నాలుగు, ఐదో భాగాలు తెరకెక్కించడం సాధ్యం కాదని అంటున్నారు. మరికొద్ది రోజుల్లో అంతా తేలిపోతుంది.
‘అవతార్’ని మూడు భాగాలతో ముగించాలా? ఇంకా ముందుకెళ్లాలా తెలుస్తుంది అని కామెంట్స్ చేశారాయన. రాబోయే రెండు ‘అవతార్’లకు భారీ వసూళ్లు రాకపోతే ఈ ఫ్రాంచైజీని ఇక్కడితో ముగిస్తా అని చెప్పారాయన. కాబట్టి సినీ ప్రేక్షకులు ఏం చేస్తారు, సినిమాకు ఏ పాటి వసూళ్లు అందిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ప్రోత్సాహం లేకపోతే సినిమా లేదు.