“సర్దార్, పోన్నియన్ సెల్వన్” లాంటి డీసెంట్ హిట్స్ అనంతరం కార్తీ హీరోగా నటించిన 25వ చిత్రం “జపాన్”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎప్పట్లానే అనువాదరూపంలో తెలుగులోనూ విడుదలైంది. కార్తీ డిఫరెంట్ స్టైల్ & బాడీ లాంగ్వేజ్ తో కనబడిన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: హైద్రాబాద్ లోని రాయల్ జ్యూయలెర్స్ లో 200 కోట్ల దోపిడీ జరుగుతుంది. ఈ దంగతనం చేసింది జపాన్ (కార్తీ) అని తెలుసుకొని అతడ్ని పట్టుకోవడానికి తెలంగాణా పోలీస్ యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగుతుంది. కట్ చేస్తే.. తనకు హై.ఐ.వి పాజిటివ్ అని తెలుసుకొన్న జపాన్, తన ప్రేయసి సంజు (అను ఇమ్మాన్యూల్)ని కలవడానికి కేరళ వెళతాడు. ఈ క్రమంలో శ్రీధర్ (సునీల్) జపాన్ ను కలిసి అతడ్ని అరెస్ట్ చేయడానికి జరుగుతున్న రచ్చ వివరిస్తాడు.
అయితే.. తాను ఆ దొంగతనం చేయలేదని షాక్ ఇస్తాడు జపాన్. అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు? జపాన్ ని ఎందుకు ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు? జపాన్ ఈ గోల నుంచి ఎలా తప్పించుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “జపాన్” చిత్రం.
నటీనటుల పనితీరు: ఒక సరికొత్త కార్తీని ఈ సినిమాలో చూస్తాం. హెయిర్ స్టైల్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకూ అన్నిట్లో కొత్తదనం ప్రయత్నించాడు కార్తీ. ముఖ్యంగా అతడి యాస భలే వింతగా ఉంది. ఇక నటుడిగా అతడి స్థాయికి తగ్గ పాత్ర కాకపోయినా.. చక్కగా ఒదిగిపోయాడు కార్తీ. ముఖ్యంగా కామెడీ టైమింగ్ & యాక్షన్ సీక్వెన్స్ లలో తన సత్తా చాటుకుని.. ఆడియన్స్ ను అలరించాడు.
సునీల్ కి మంచి పాత్ర లభించింది. అతడి పాత్రలో సీరియస్నెస్ & కామెడీ రెండూ పుష్కలంగా ఉన్నాయి. అతడు కమెడియన్ గా కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదుగుతున్న విధానం ప్రశంసనీయం. అను ఇమ్మాన్యూల్ పాత్రకు పెద్ద ప్రాముఖ్యత లేదు. కాకపోతే.. అందాల ప్రదర్శనతో మాత్రం ఆకట్టుకుంది. మిగతా పాత్రధారులందరూ తమకు లభించిన పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు రాజా మురుగన్ “జీవితానికి ఒక అర్ధం ఇచ్చే మన చావే” అనే కాన్సెప్ట్ లో రాసుకున్న కథ ఫిలాసాఫికల్ గా భలే ఉంది. అయితే.. ఆ కథను నడిపించిన విధానం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా సినిమాలో సినిమా కాన్సెప్ట్ లో తెరకెక్కించిన కామెడీ సీన్స్ ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేదు. అయితే.. లాజికల్ గా అతడు ఇచ్చిన లైఫ్ లెసన్స్ మాత్రం మెచ్చుకోవాలి. దర్శకుడిగా ఆకట్టుకోలేకపోయినా, కథకుడిగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకున్నాడు రాజా మురుగన్. ముఖ్యంగా సినిమాను ఎండ్ చేసిన విధానం అతడికి మంచి పేరు తెచ్చి పెడుతుంది.
జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం సోసోగా ఉన్నా.. నేపధ్య సంగీతం పర్వాలేదనిపించుకున్నాడు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ వర్క్ & ఆర్ట్ వర్క్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఫీలోమిన్ రాజ్ ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ రిచ్ గా ఉంది.
విశ్లేషణ: తన ఇమేజ్ కు భిన్నంగా కార్తీ ప్రయత్నించిన సినిమా “జపాన్”. కామెడీ మాత్రమే ఆశించకుండా.. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ చిత్రాన్ని చూడొచ్చు.
రేటింగ్: 2.5/5