ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇటీవల క్వీన్స్ లైన్ లిటరేచర్ ఉత్సవంలో రచయిత రామ్ కమల్‌తో జరిగిన సంభాషణలో షాకింగ్ కామెంట్స్ చేశారు. 2009 సంవత్సరం నాటి ఘటనను తలుచుకుని బాధపడ్డారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను అంటూ జయప్రద చేసిన కామెంట్స్ అందరినీ షాక్ కి గురి చేసాయనే చెప్పాలి. జయప్రద ఇలాంటి కామెంట్స్ చేయడానికి అసలు కారణం.. గతంలో వచ్చిన తన మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో సర్కులేట్ కావడమే అని స్పష్టంచేసారు.
ఇక విషయం పై జయప్రద మాట్లాడుతూ… ” ఆ రోజు నేను బాగా ఏడ్చాను. ఏదేమైనా.. నేను ఆత్మ హత్య చేసువాలి.. అస్సలు బ్రతక్కూడదని అనుకున్నాను. అలా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చాను. తీవ్రమైన నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయిన … ఆ సమయంలో నాకు ఎవరూ అండగా నిలవలేదు…! అయితే అమర్ సింగ్ నాకు మద్దతుగా నిలవడంతో… బ్రతుకు పై మళ్ళీ ఆశ కలిగింది. నా మార్ఫింగ్ ఫొటోలు సర్కులేట్ చేసింది సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్. అంతేకాదు నా పై యాసిడ్ దాడి చేస్తామని కూడా బెదిరించారు. దీనికి కారణం ఆజంఖాన్ పై నేను ఎన్నికల్లో పోటీ చేయడమే..” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసారు జయప్రద. జయప్రద మొదట సమాజ్‌వాదీ పార్టీలోనే ఉండేవారు. కానీ విబేధాల కారణంగా.. ఆ పార్టీ నుండీ బయటకు వచ్చి ఆమర్ సింగ్‌తో కలిసి ‘రాష్ట్రీయ్ లోక్ మాంచ్ పార్టీ’ స్థాపించారు. అప్పటి నుంచి వీరిద్దరి బంధం గురించి పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, రామ్‌పూర్ ఎమ్మెల్యే అజామ్ ఖాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు జయప్రద. ఇక తన పై యాసిడ్ పోస్తానంటూ అజామ్ ఖాన్ తనను బెదిరించినప్పటికీ… తాను భయపడలేదన్నారు. ఈ విషయం పై స్పందిస్తూ ‘నా ప్రాణానికి ప్రమాదం ఉందని నాకు తెలుసు. నేను ఇంటి నుండీ బయటికి వెళితే తిరిగి క్షేమంగా వస్తానో? లేదో కూడా మా అమ్మకు చెప్పలేకపోతున్నాను. ఏ ఒక్క రాజకీయ నాయకుడు నాకు మద్దతుగా నిలవలేదు. ములాయం సింగ్ కూడా ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయలేదని’ విచారం వ్యక్తం చేశారు జయప్రద.