కమెడియన్ గా సూపర్ ఫామ్ లో శ్రీనివాస్ రెడ్డి మొన్నామధ్య “గీతాంజలి”తో హీరోగా మారి సూపర్ హిట్ అందుకొన్నాడు. చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న ఆ చిత్రం తర్వాత శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన రెండో చిత్రం “జయమ్ము నిశ్చయమ్ము రా”. పూర్ణ కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా యువ ప్రతిభాశాలి శివరాజ్ కనుమూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. విడుదలకు ముందు నుంచి విశేషమైన పబ్లిసిటీతో జనాల్ని విశేషంగా ఆకర్షించిన ఈ చిత్రాన్ని విడుదలకు రెండ్రోజుల ముందే “పబ్లిక్ ప్రీమియర్” అంటూ ప్రదర్శించి ఎనలేని ప్రాచుర్యం దక్కించుకొన్నాడు.
టైటిల్ కి తగ్గట్లు సినిమాకి జయం నిశ్చయమైందా, శ్రీనివాస్ రెడ్డికి హీరోగా సెకండ్ సినిమా సక్సెస్ ఇచ్చిందా లేదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.
కథ : సర్వేష్ కుమార్ అలియాస్ సర్వం (శ్రీనివాస్ రెడ్డి) సగటు యువకుడు. వరంగల్ లోని ఓ మారుమూల గ్రామంలో తన తల్లితోపాటు ఉంటూ.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. పదేళ్ళ సుధీర్ఘ ప్రయత్నం అనంతరం ఎట్టకేలకు మున్సిపల్ ఆఫీస్ లో గుమాస్తా ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే.. కాకినాడలో పోస్టింగ్ లభిస్తుంది.
స్వతహా ఆత్మన్యూనత (ఆత్మవిశ్వాసం) తక్కువగల సర్వం దొంగ స్వామి అయిన పితా (జీవా)ను గుడ్డిగా నమ్మతూ.. అతడు చెప్పిన మాటలను తూ.చ తప్పకుండా పాటిస్తుంటాడు. అలా పితా చెప్పినట్లుగానే ఇందూరి రాణి (పూర్ణ)ను ప్రేమిస్తాడు. మొదట్లో పితా చెప్పినట్లు జాతకం పిచ్చితోనే ప్రేమించినప్పటికీ.. తర్వాతర్వాత ఆమెను నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలుపెడతాడు. కట్ చేస్తే.. అప్పటికే పూర్ణ అదే మున్సిపల్ ఆఫీస్ అధికారి అయిన జె.సి (రవి వర్మ)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలుసుకొన్న సర్వం ఆమెకు దూరంగా ఉండాలని ఫిక్స్ అవుతాడు. అయితే.. అతడి మనస్సాక్షి మాత్రం అందుకు ఒప్పుకోదు. ఈ మూఢ నమ్మకాన్ని పక్కనపెట్టి రాణిని సొంతం చేసుకోవడంతో.. మనసులోని భయాన్ని కూడా వదిలించుకోమని హితబోధ చేస్తుంది.
గుండెల్నిండా ఆత్మ విశ్వాసం నింపుకొన్న సర్వం అప్పటివరకూ తనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా ఎలా మార్చుకొన్నాడు, రాణిని తన భార్యగా చేసుకోగలిగాడా, అందుకు అతడు ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేది “జయమ్ము నిశ్చయమ్ము రా” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
నటీనటుల పనితీరు : సర్వం పాత్రలో ఫస్టాఫ్ మొత్తం తనపై తనకే నమ్మకంలేని మధ్యతరగతి యువకుడిగా, సెకండాఫ్ లో గుండెల్నిండా విశ్వాసం నింపుకొన్న ఆత్మస్థైర్యం గల ఘనుడిగా శ్రీనివాస్ రెడ్డి అద్భుతంగా నటించాడు. తనను తాను ప్రశ్నించుకొనే సన్నివేశాల్లో, మదర్ సెంటిమెంట్ సీన్స్ లో శ్రీనివాస్ నటన చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అచ్చ తెలుగమ్మాయిగా పూర్ణ ఒద్దికగా ఒదిగిపోయింది. సగటు యువతిలో ఉండే ఆకర్షణ, ప్రేమ, నమ్మకం వంటి చాలా భావాల్ని తన పాత్ర ద్వారా అర్ధవంతంగా పండించింది. నవతరం యువతులు రాణి పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు.
అడపా ప్రసాద్ గా కృష్ణభగవాన్, తత్కాల్ పాత్రలో ప్రవీణ్, జోగి బ్రదర్స్, పోసాని కృష్ణమురళి కథలో కీలకపాత్ర పోషిస్తూనే ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించారు. ముఖ్యంగా.. కృష్ణభగవాన్ “మంగళవారం” ఎపిసోడ్ కు థియేటర్ లో జనాలు కడుపుబ్బ నవ్వాల్సిందే. రవివర్మ నెగిటివ్ రోల్ లో విలనిజాన్ని కాస్త భిన్నంగా ప్రెజంట్ చేశాడు. మిగతా నటీనటులందరూ సన్నివేశానికి తగిన విధంగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు : రవిచంద్ర సమకూర్చిన బాణీలు వినడానికి కమ్మగా, చూడడానికి ఆనందదాయకంగా ఉన్నాయి. కార్తీక్ రోడ్రెజ్ నేపధ్య సంగీతం కూడా నేటివిటీని ప్రతిబింబిస్తూనే సన్నివేశంలోని ఎమోషన్ ను చక్కగా ఎలివేట్ చేసింది. నగేష్ బానెల్ ఫోటోగ్రఫీ సినిమాకి ఆయువుపట్టు అని చెప్పుకోవచ్చు. టాప్ యాంగిల్ షాట్స్, సముద్రం ఎలివేట్ అయ్యేలా తీసిన లాంగ్ షాట్స్ కంటికింపుగా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్ గా ఉంటే బాగుండేది. ఫస్టాఫ్ లో ల్యాగ్ ఎక్కువయ్యింది. క్లైమాక్స్ లో వచ్చే పెళ్లి ఎపిసోడ్ కూడా సాగినట్లు అనిపిస్తుంది.
దర్శకుడు శివరాజ్ కనుమూరికి సినిమా పట్ల ఉన్న అపారమైన మేధస్సు ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంటుంది. ప్రతి సన్నివేశం, ఆ సన్నివేశంలోని ఎమోషన్ చాలా నేచురల్ గా ఉంటాయి. ఎక్కడా అతి అనేది కనిపించకుండా.. నటీనటుల నుంచి సన్నివేశానికి తగిన నటన రాబట్టుకోవడంతోపాటు, స్వచ్చమైన భావోద్వేగాలను వెండితెరపై పండించిన తీరు బాగుంది. అయితే.. ప్రతి పాత్ర క్యారెక్టరైజేషన్ ను జనాలకు అర్ధమయ్యేలా చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం మాత్రం ప్రేక్షకుడ్ని కాస్త ఇబ్బందిపెడుతుంది. అక్కడక్కడా వచ్చే ల్యాగ్ ను కాస్త భరించగలిగితే.. ఒక మంచి సినిమా చూశామన్నా సంతృప్తిని మిగిల్చే సినిమాగా “జయమ్ము నిశ్చయమ్ము రా”ను తీర్చిదిద్దాడు దర్శకుడు.
విశ్లేషణ : రెండున్నర గంటలపాటు స్వచ్చమైన వినోదాన్ని పంచే అన్నీ అంశాలు ఉన్న చిత్రం “జయమ్ము నిశ్చయమ్ము రా”. శ్రీనివాస్ రెడ్డి పరిణితి చెందిన నటన, దర్శకుడు పాత్రలను తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచిన ఈ చిత్రాన్ని సకుటుంబ సమేతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరదాగా చూడవచ్చు!
రేటింగ్ : 3/5