భరత్ అనే నేను లో రెండు సందేశాలను అందించారు – జేపీ

కొరటాల శివ మొదట నుంచి సందేశాత్మక చిత్రాలను అందించారు. తాజాగా మహేష్ బాబు తో తెరకెక్కించిన భరత్ అనే నేను పొలిటికల్ నేపథ్యంలో సాగింది. ఏ రాజకీయ నేతని విమర్శించకుండా అందరినీ ఆలోచింపచేసే విధంగా కమర్షియల్ సినిమాని మలిచారు. ఈ మూవీ వారం రోజుల్లో 161 కోట్ల గ్రాస్ వసూలు చేయడమే కాదు సినీ సెలబ్రిటీల అభినందనలు అందుకుంది. తాజాగా లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్‌ నారాయణ‌ కొరటాల శివపై ప్రశంసల జల్లు కురిపించారు. అరుదుగా చిత్రాలు చూసే ఈయన భరత్ అనే నేను సినిమాని చూసి ట్విటర్‌ వేదికపై  తన అభిప్రాయాన్నివెల్లడించారు. “నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశా. ప్రజల్ని ఆలోచింపజేసేలా చట్ట నిబంధనలు, స్థానిక పరిపాలన అనే రెండు బలమైన సందేశాలను కలిసి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా కొరటాల శివ సినిమాను రూపొందించారు” అని అభినందించారు. ఇంకా కొరటాల ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

“స్థానికంగా తీసుకునే నిర్ణయాల ప్రభావం స్థానికుల జీవితాలపైనే ఉంటుంది. పక్కవారి మీద కాదు. అప్పుడే ప్రజలు ఓటింగ్‌-తమ జీవితాలు, పన్నులు-సేవలకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుంటారు. లోకల్‌ గవర్నమెంట్‌‌లో అధికారాన్ని వృథా చేస్తున్నారు. కొరటాల శివ ధైర్యానికి, కష్టానికి అభినందనలు” అని జేపీ ట్వీట్‌  చేశారు. జయప్రకాశ్‌ నారాయణ‌ ట్వీట్ చిత్ర బృందానికి ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా కొరటాల శివ వెంటనే స్పందించారు. “మీలాంటి వ్యక్తి దగ్గర నుంచి ప్రశంసలు దక్కడం గౌరవంగా భావిస్తున్నాను సార్. మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి మాకు మీ అవసరం ఉంది” అని రీ ట్వీట్‌ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus