నందికి కులాన్ని పూయడంపై జీవిత ఆవేదన!

  • November 18, 2017 / 09:40 AM IST

నంది అవార్డులపై వస్తున్న విమర్శలు గత కొన్ని రోజులుగా బ్రేకింగ్ న్యూస్ అయ్యాయి. ఈ వివాదం రోజురోజుకి పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఈ విషయంపై  మాట్లాడుకుంటున్నారు. దీనిపై నటి, దర్శకురాలు జీవిత స్పందించారు. 2015 సంవత్సరానికి జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఆమె అవార్డులపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. “మూడు నెలల పాటు ఓపికగా కూర్చుని సినిమాలన్నీ చూసి అవార్డ్‌ విజేతలను ఎంపిక చేశాం.

ఏ రాజకీయ నాయకుడి ప్రభావం మాపై లేదు. ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా ఆలోచించాలి. నెగిటివ్‌గా ఆలోచిస్తే అన్నీ తప్పులే కనిపిస్తాయి. అయినా అవార్డుల గురించి జనం చర్చించుకోవడం లేదు. కొంతమంది టీవీ లైవుల్లో కూర్చుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పరిశ్రమ పరువుని దిగజారుస్తున్నారు. అదే బాధగా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. “రుద్రమదేవి” చిత్రం కనీసం స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌కు కూడా నోచుకోలేదా? అనే విమర్శపై ఆమె స్పందిస్తూ “అక్కడ కూడా అంతే పోటీ ఉంది. అందుకే అన్ని కోణాల్లోనూ పరిశీలించి దీటైన సినిమానే ఎంపిక చేశాం. బాగున్న సినిమాను బాగోలేదని చెప్పడం మాకేమైనా సరదానా?” అని తిరిగి ప్రశ్నించారు. ”  సపోర్టింగ్‌ క్యారెక్టర్‌‌గా అల్లు అర్జున్‌ పేరుని ఎంట్రీకి పంపి ఉండవచ్చు. కానీ అదొక మంచి పాత్రకనుక ఎస్వీ రంగారావుగారి పేరుతో ఉన్న అవార్డ్‌ ఇచ్చాం. ఇదొక గొప్ప విషయమని మేం అనుకొంటున్నాం.

ఈ విషయం గురించి అల్లు అరవింద్‌గారు, చిరంజీవిగారు, బన్నీ ఎవరూ మాట్లాడట్లేదు. బయటవాళ్లే మాట్లాడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “జ్యూరీ ప్రాసెస్‌ ఎలా జరిగిందో.. తెలియకుండా మాట్లాడే అర్హత ఎవరికీ లేదు” అని విమర్శలను జీవిత  గట్టిగానే తిప్పికొట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus