జెర్సీ

  • April 19, 2019 / 01:31 PM IST

వరుస కమర్షియల్ సినిమాల తర్వాత నాని నటించిన ఎమోషనల్ ఫిలిమ్ “జెర్సీ”. క్రికెట్ నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా నటించగా “యూ టర్న్, విక్రమ్ వేదా” ఫేమ్ శ్రద్ధా శ్రీనాధ్ కథానాయికగా నటించింది. “మళ్ళీ రావా” అనంతరం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. నాని కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానంటూ పలుమార్లు పేర్కొన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: 78 హాఫ్ సెంచరీలు, 36 సెంచరీల హయ్యస్ట్ క్రెడిబిలిటీ ఉన్న క్రికెట్ ప్లేయర్ అర్జున్ (నాని). ఇండియన్ క్రికెట్ టీం కి ఆడాలన్నదే అర్జున్ ధ్యేయం. కానీ.. కారణాంతరాల వలన క్రికెట్ కెరీర్ ను పక్కన పెట్టి స్పోర్ట్స్ కోటాలో వచ్చిన ఉద్యోగం చేసుకుంటూ.. ఇష్టపడిన సారా (శ్రద్ధా శ్రీనాథ్)ను పెళ్లి చేసుకొని కొడుకు (రోనిత్)తో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. కానీ.. లంచం తీసుకొన్నాడనే ఒక అబద్ధపు కేస్ కారణంగా ఉద్యోగం కోల్పోయి.. మరో ఉద్యోగం చేయలేక, దొరక్క భార్య సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతుంటాడు.

తన ఉద్యోగాన్ని తాను తిరిగి దక్కించుకోవడానికి లంచం ఇవ్వడం ఇష్టం లేక.. ధర్మ పోరాటం చేస్తూనే ఉంటాడు కానీ.. తన కోచ్ మూర్తి (సత్యరాజ్) ఎన్నిసార్లు అసిస్టెంట్ కోచ్ గా ఉద్యోగ ప్రయత్నం చేయమన్నా ఆ అవకాశాన్ని తిరస్కరిస్తాడు. కానీ.. పదేళ్ళ తర్వాత కొడుక్కి పుట్టినరోజు గిఫ్ట్ గా ఒక “జెర్సీ” కొనివ్వడం కోసం ఒక ఛారిటీ మ్యాచ్ ఆడతాడు. అర్జున్ వయసు 36 అయినా.. అతని ఆట మాత్రం 25 ఏళ్ల కుర్రాళ్లకన్నా మెరుగ్గా ఉండడం చూసిన మూర్తి అర్జున్ ని కోచ్ జాబ్ కి ప్రయత్నించమని అడుగుతాడు.

కానీ.. పదేళ్ళ కాలంలో తాను క్రికెట్ ఆడడం మానేయడం వలన ఏం మిస్ అయ్యాడో గ్రహించిన అర్జున్.. తాను మళ్ళీ రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటున్నానని కోచ్ కి చెప్తాడు. ఆ తర్వాత రంజీ టీం లో స్థానం కోసం అర్జున్ ఎంతలా కష్టపడ్డాడు? స్థానం సంపాదించుకున్న తర్వాత అతడి ప్రయాణం ఎలా సాగింది? ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు? చివరికి ఏం జరిగింది అనేది “జెర్సీ” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: ఓ నటుడి ప్రయాణాన్ని అతని నటన చూసి కాదు.. అతను ఎంచుకునే పాత్రల ద్వారా జడ్జ్ చేయాలి. ఆ ప్రకారం చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్, మార్కెట్, ఫ్యాన్స్ లాంటి లెక్కలు ఏమీ వేసుకోకుండా నాని తరహాలో భిన్నమైన పాత్రలు చేసిన నటుడు మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అర్జున్ పాత్రలో నాని జీవించాడు, అద్భుతమైన హావభావాలు ప్రదర్శించాడు అని చెప్పడం కంటే.. తెర మీద కనిపించేది నాని కాదు అర్జున్ అని ప్రేక్షకులు మెదళ్ళలో ఫిక్స్ అయిపోతారు అనడం సబబు. భార్య కొట్టినా కూడా కనీసం చెయ్యెత్తని అత్యుత్తమమైన భర్త అర్జున్.. కొడుకు సంతోషం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టగల నిశ్వార్ధమైన తండ్రి అర్జున్. ఆ పాత్రకున్న ఔన్నిత్యాన్ని దర్శకుడు గౌతమ్ ఎంత అద్భుతంగా రాసుకున్నాడో.. నాని అంతే అద్భుతంగా ఆ పాత్రను పండించాడు.

శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు సినిమాకు పరిచయమైన మరో సమర్ధవంతమైన నటి. గ్లామర్ తోపాటు యాక్టింగ్ లో గ్రామర్ కూడా పర్ఫెక్ట్ గా తెలిసిన నటి శ్రద్ధా శ్రీనాథ్. ఓ మధ్యతరగతి భార్యగా ఆమె నటనకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోతారు.

బహుశా బాహుబలి తర్వాత సత్యరాజ్ లోని నటుడ్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్న చిత్రమిదే అనుకుంటా. కోచ్ మూర్తి పాత్రలో సత్యరాజ్ ను తప్ప వేరొకరిని ఊహించుకోలేం. అర్జున్ కొడుకు నాని క్యారెక్టర్ లో రోనిత్ అనే చిచ్చరపిడుగు అదరగొట్టాడు. ఎమోషనల్ సీన్స్ ను సరిగా రంజింపజేయలేకపోయాడు కానీ.. ఆన్ స్క్రీన్ చాలా కొత్తగా కనిపించాడు. “బంగారం” చిత్రంలో పవన్ కళ్యాణ్ తో కలిసి అల్లరి చేసిన చిన్నారి సనూష ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ప్రవీణ్, నవీన్, కృష్ణ తేజ, మొయీన్, విశ్వంత్ ఇలా ప్రతి ఒక్కరూ గౌతమ్ రాసుకున్న పాత్రలకు ప్రాణం పోశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఒక సినిమాకి సాంకేతికపరంగా ఏదైనా ఒక విభాగాన్ని ప్లస్ పాయింట్ గా పేర్కొనగలం. కానీ.. “జర్సీ” సినిమాకి వచ్చేసరికి అందరూ దర్శకుడు గౌతమ్ లాగే స్క్రిప్ట్ పై వల్లమాలిన ప్రేమను పెంచుకొన్నారేమో.. ప్రతి ఒక్కరూ తమ కెరీర్ బెస్ట్ వర్క్ అందించారు. సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ అయితే.. 70 ఎం.ఎం స్క్రీన్ మీద ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా-పాకిస్తాన్ మధ్య జరుగుతున్నంత ఉత్సుకతను కలిగించింది. లైటింగ్ కానివ్వండి, ఫ్రెమింగ్స్ కానివ్వండి పర్ఫెక్ట్ క్రికెట్ ఫీల్ ను ఇచ్చాయి.

అనిరుధ్ “బీజీయమ్” స్పెషలిస్ట్ అని మరోసారి ఈ చిత్రంతో ప్రూవ్ అయ్యింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కి అనిరుధ్ అందించిన నేపధ్య సంగీతం మన హృదయ స్పందనను శాసిస్తుంది. నిర్మాత సూర్యదేవర వంశీ నాని ఉన్నాడు కాబట్టి అని కాకుండా కథకు అవసరం కాబట్టి అని ఖర్చు చేశాడు. అందుకే.. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కాకుండా సహజంగా కనిపిస్తుంది. “మళ్ళీ రావా” చూసినప్పుడే దర్శకుడు గౌతమ్ పనితనం మీద గౌరవం ఏర్పడింది. “జెర్సీ” చూశాక ఆ గౌరవం కాస్త ప్రేమగా మారింది. ఒక ఫైట్ లేదు, హీరోహీరోయిన్లు డ్యాన్స్ చేసే ఒక సాంగ్ లేదు, హీరో ఇంట్రడక్షన్ సీన్ అంటూ ఒక స్లోమోషన్ షాట్ లేదు.. ఆఖరికి హీరోయిజం కూడా లేదు. అలాంటి కథను గౌతమ్ ఏ ధైర్యంతో రాసుకున్నాడు, నాని ఎలా ఒప్పుకున్నాడు అని ఒక్కసారైనా సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడికి అనిపించక మానదు. కానీ.. “జెర్సీ” సినిమాలో పైన పేర్కొన్న కమర్షియల్ అంశాలన్నిటి కంటే ముఖ్యమైన “ఎమోషన్” ఉంది.

అది భార్యాభర్తల నడుమ సాగే బాధ్యతాయుతమైన మౌన పోరాటం కావచ్చు, తండ్రీకొడుకుల నడుమ ఉండే స్వచ్చమైన ప్రేమ కావచ్చు.. క్రికెట్ మీద అర్జున్ కి ఉన్న ఇష్టం కావచ్చు. ఇలా ఒక ప్రేక్షకుడ్ని 160 నిమిషాల పాటు థియేటర్లో కదలకుండా కూర్చోబెట్టడమే కాక కన్నీరు పెట్టించగల సత్తా ఉన్న అద్భుతమైన కథ-కథనం రాసుకున్న గౌతమ్ తిన్ననూరును గట్టిగా కౌగిలించుకొని మరీ ఘన విజయం సాధించినందుకు అభినందించాలని అనిపించింది.

తాను రంజీ టీం కి సెలక్ట్ అయ్యాను అని తెలిసిన తర్వాత నాని సైలెంట్ గా అక్కడ్నుంచి వెళ్ళిపోయి “ఖైరతాబాద్ రైల్వే స్టేషన్” దగ్గరకి చేరుకుంటాడు. ఇక్కడ ఏం పని అని ఆడియన్స్ అందరూ ప్రశ్నార్ధకంగా మొహాలు పెట్టగా.. తన ఆనందాన్ని రన్నింగ్ ట్రైన్ సౌండ్ ను కూడా డామినేట్ చేసే స్థాయిలో బిగ్గరగా అరిచి వ్యక్తపరిచే ఒకే ఒక్క సన్నివేశం చాలు.. దర్శకుడు గౌతమ్ “అర్జున్” అనే పాత్రను ఎంతలా ప్రాణం పెట్టి రాసుకున్నాడో చెప్పడానికి.

విశ్లేషణ: దర్శకుడు గౌతమ్ “జెర్సీ” కంటే మంచి సినిమాలు తీయొచ్చు, నాని ఇంతకంటే మంచి సినిమాలు చేయొచ్చు కానీ.. “జెర్సీ” లాంటి అద్భుతమైన చిత్రాన్ని మాత్రం రీక్రియేట్ చేయలేరు. సో, మిస్ అవ్వకుండా “జెర్సీ” చిత్రాన్ని థియేటర్లో చూసి ఆనందించండి.

రేటింగ్: 3.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus