‘శివపుత్రుడు, వాడు-వీడు” చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధా ఏర్పరుచుకోవడంతోపాటు, ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో సిద్ధహస్తుడైన బాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “నాచియార్”. తమిళంలో రూపొందిన ఈ చిత్రంలో జ్యోతిక, జి.వి.ప్రకాష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తెలుగులో “ఝాన్సీ” పేరుతో అనువదించారు. మరి బాల మునుపటి చిత్రాల తరహాలో ఈ చిత్రం కూడా వైవిధ్యమైన చిత్రానుభూతిని మిగిల్చిందా? లేదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.
కథ:
జాలి రాజు (జీవి ప్రకాష్), రాశీ (ఇవానా) మైనర్ ప్రేమికులు. తెలియక చేసిన తప్పు కారణంగా రాశీ గర్భవతి అవుతుంది. దాంతో.. పోలీసులు జాలిరాజుని మైనర్ రేప్ లో అరెస్ట్ చేస్తారు. చిన్న పిల్ల అయినా రాశీని అక్కున చేర్చుకొంటుంది ఝాన్సీ (జ్యోతిక).
అయితే.. డి.ఎన్.ఏ టెస్ట్ చేయించగా రాశీ కడుపున పుట్టిన బిడ్డకు జాలిరాజుకు సంబంధం లేదని తెలుసుకొంటుంది ఝాన్సీ.. రాశీ గర్భం దాల్చడానికి అసలైన కారకులెవరో తెలుసుకోవాలని మొదలెట్టిన ఇన్వెస్టిగేషన్ లో నమ్మలేని దారుణమైన నిజాలు బయటపడతాయి.
ఇంతకీ రాశీ కడుపున పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు? జాలిరాజు పోలీస్ కేస్ నుంచి బయటపడగలిగాడా? జాలిరాజు-రాశీలకు ఝాన్సీ ఎలా న్యాయం చేసింది? వంటి ప్రశ్నలకు సమాధానంగా బాల తెరకెక్కించిన చిత్రం “ఝాన్సీ”.
నటీనటుల పనితీరు:
జ్యోతిక ఈ చిత్రంలో సర్ప్రైజ్ ప్యాకేజ్ లాంటిది. నిన్నమొన్నటివరకూ సాంప్రదాయమైన గృహిణిగా, పక్కింటి అమ్మాయిలా కనిపించిన జ్యోతిక ఈ చిత్రంలో ఝాన్సీ అనే పోలీస్ పాత్రలో చాలా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ యాక్టింగ్ తో ఆశ్చర్యపరిచింది. కొన్ని సన్నివేశాల్లో తన మ్యానరిజమ్స్ తో విజయశాంతిని సైతం మరపించింది. అయితే.. తెలుగు వెర్షన్ కు చెప్పిన డైలాగ్ వెర్షన్ మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే ఆ పాత్ర అందరికీ చేరువయ్యేది.
జీవి ప్రకాష్ నుంచి కూడా బాల సాధ్యమైనంతవరకూ సహజనమైన నటన రాబట్టుకొన్నాడు. ఎమోషనల్ సీన్స్ లో జీవి ప్రకాష్ నటన, పలికించిన హావభావాలు అద్భుతంగా ఉంటాయి.
అమాయకమైన అమ్మాయిగా ఇవానా చక్కగా పాత్రలో ఒదిగిపోయింది. ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా మంచి పాత్ర పోషించారు.
సాంకేతికవర్గం పనితీరు:
ఇళయరాజా సంగీతం, నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలిచింది. అన్నీ వర్గాల వారికి సినిమాలోని ఎమోషన్ చేరువయ్యేలా, ఫీల్ అయ్యేలా ఇళయరాజా తీసుకొన్న జాగ్రత్త బాల పనితనానికి ప్రతీకలా నిలిచింది.
తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీలో పెద్దగా వైవిధ్యం ఏమీ కనిపించలేదు. తన మునుపటి చిత్రాల్లో కెమెరా ఫ్రేమింగ్స్ తోనే మాయ చేసిన బాల ఈ సినిమాలో మాత్రం కెమెరా వర్క్ విషయంలో పెద్ద జాగ్రత్త తీసుకోకపోవడం గమనార్హం.
డబ్బింగ్ విషయంలో చిత్రాన్ని అనువదించిన నిర్మాతలు ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది. అనవసరంగా ఇరికించిన బూతులు, మాస్ ఆడియన్స్ ను ఓ మోస్తరుగా ఆకట్టుకోగలదు కానీ.. జనరల్ ఆడియన్స్ కు మాత్రం కాస్త ఇబ్బందికరమైన విషయమే.
ఇప్పటివరకూ దర్శకుడు బాల తెరకెక్కించిన సినిమాలు గమనిస్తే కమర్షియల్ అంశాలు ఇరికించినట్లుగా ఎక్కడా కనిపించదు, అనిపించదు. ఆయన సినిమాల్లో సునిశితమైన భావాలను, కాస్త ఘాటైన సందర్భాలను ఎంతో హృద్యంగా కనిపిస్తుంటాయి. కానీ.. “ఝాన్సీ” చిత్రంలో మాత్రం ఆయన మార్క్ కంప్లీట్ గా మిస్ అయ్యింది. సెకండాఫ్ లో వచ్చే ఒకట్రెండు సన్నివేశాల్లో తప్ప సినిమా మొత్తంలో ఎక్కడా పెద్ద ఎమోషన్ కూడా పండలేదు. ఆ కారణంగా సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా “బాల” సినిమా చూస్తున్నాం అనే భావన కలుగదు. ఆయన మరి కొత్తగా ట్రై చేయాలనుకొన్నాడో లేక బాల కమర్షియల్ సినిమా తీస్తే ఇలా ఉంటుంది అని చూపించాలనుకొన్నాడో తెలియదు కానీ ప్రేక్షకులు మాత్రం బాల మార్క్ ను మిస్ అయ్యారు.
విశ్లేషణ:
రాఘవేంద్రరావు సినిమాలో పువ్వులు-పండ్లు, వినాయక్ సినిమాలో సుమోలు-బాంబులు, సుకుమార్ సినిమాలో సెన్సబిలిటీస్ కనిపించకపోతే ఎంత బాధపడతామో.. బాల సినిమాలో సహజత్వం కనిపించకపోతే కూడా అంతే బాధపడతాము. ఇప్పటివరకూ బాల తీసిన సినిమాల్లో కమర్షియల్ హిట్స్ సాధించినవి తక్కువే కావచ్చు.. కానీ ఇప్పటివరకూ ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల్ని నిరాశపరచలేదు. ఒక దర్శకుడిగా ప్రేక్షకుల్లో ఆయన సంపాదించుకొన్న స్థానం అలాంటిది. అలాంటి వ్యక్తి నేడు కమర్షియాలిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కచ్చితంగా చిత్రపరిశ్రమకు పెద్ద లోటు. ఈ విషయాన్ని బాల గమనించి మరో “శివపుత్రుడు” రేంజ్ సినిమా కాకపోయినా కనీసం “పరదేశి” లాంటి సినిమా తీసినా చాలు. థియేటర్ లో కదలకుండా కూర్చుండిపోతారు ప్రేక్షకులు.
రేటింగ్: 2/5