Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ (Hero)
  • హ్యుమా ఖురేషి, అమృత అరోరా (Heroine)
  • సౌరభ్ శుక్లా, గజరాజ్, రామ్ కపూర్, సీమా బిస్వాస్ (Cast)
  • సుభాష్ కపూర్ (Director)
  • అలోక్ జైన్ - అజిత్ అందారే (Producer)
  • మంగేష్ దాక్డే (Music)
  • రంగరాజన్ రామభద్రన్ (Cinematography)
  • చంద్రశేఖర్ ప్రజాపతి (Editor)
  • Release Date : సెప్టెంబర్ 19, 2025
  • స్టార్ స్టూడియోస్ - కాంగ్రా టాకీస్ (Banner)

జాలీ ఎల్.ఎల్.బి సాధించిన అఖండ విజయం సీక్వెల్ కు దారి తీయగా, సెకండ్ పార్ట్ సోసోగా ఆడి పర్వాలేదనిపించుకుంది. దాంతో మూడో పార్ట్ కి తెరలేపాడు దర్శకుడు సుభాష్ కపూర్. ఇద్దరు జాలీలు కలిసి జాకీలు వేసిన ఈ “జాలీ ఎల్.ఎల్.బి 3” ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

Jolly LLB 3 Review

కథ:
రాజస్థాన్ లోని బికనేర్ గ్రామంలో ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త హరిభాయ్ (గజరాజ్) రాక్షస ప్రయత్నాన్ని ఆ ఊరి వ్యవసాయదారులందరూ వ్యతిరేకిస్తారు.
అయితే ప్రభుత్వాధికారులు తన చేతిలో ఉండడంతో రకరకాల మతలబులు చేసి ఆ భూములను దక్కించుకుంటాడు.
న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వారికి.. ఇద్దరు జాలీలు (అక్షయ్, అర్షద్) కలిసి ఎలా సహాయపడ్డారు? అందుకోసం వారు ఎలాంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది “జాలీ ఎల్.ఎల్.బి 3” కథాంశం.

నటీనటుల పనితీరు:
నటన పరంగా అందరూ అదరగొట్టారనే చెప్పాలి. ముఖ్యంగా గజరాజ్, సౌరభ్ శుక్లా పెర్ఫార్మెన్సులు హైలైట్స్ గా నిలుస్తాయి.
అర్షద్ వార్సీ క్యారెక్టర్ ని ఎందుకో బాగా డౌన్ చేసారు అనిపించింది, అతడి పాత్ర వ్యవహారశైలిని, ఆటిట్యూడ్ ని కామెడీగా మార్చేశారు. అందువల్ల ఆ పాత్ర యొక్క ఒరిజినాలిటీని కచ్చితంగా మిస్ అవుతాం.
అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్ తో నెట్టుకొచ్చేశాడు. అతడి పాత్రకి కూడా సరైన జస్టిఫికేషన్ లేదు.
రామ్ కపూర్, సీమా బిస్వాస్ లాంటి సీజన్డ్ ఆర్టిస్టులు తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు:
టెక్నికల్ గా పెద్ద చెప్పుకోదగ్గ పాజిటివ్ లు కానీ నెగిటివ్ లు కానీ లేవు. బాలీవుడ్ బడా హీరో సినిమాకి కావాల్సిన అన్నీ హంగులు ఉన్నాయి. సినిమాలో లోపించింది మంచి కథ, ఆకట్టుకునే కథనం. సినిమా చూస్తున్నంతసేపు.. అసలు మొదటి రెండు పార్ట్స్ డైరెక్ట్ చేసిన సుభాష్ కపూరేనా ఈ 3 వ పార్ట్ ని డైరెక్ట్ చేసింది అనే సందేహం కలగకమానదు. సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్క ఎమోషన్ కూడా వర్కవుట్ అవ్వలేదు. తెరపై రైతుల బాధలు, వారి పోరాటం చూస్తున్నా ఎక్కడా మనసు చలించదు. ఇక ఆ వాదోపవాదాలు ఏవైతే ఉన్నాయో.. మరీ ఇంత వీక్ రైటింగా అని మనల్ని మనం పదిసార్లు ప్రశ్నించుకునేలా చేస్తాయి. ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఒక సీక్వెన్స్ లో.. ఓ పెద్ద మనిషి రిపోర్ట్ గురించిన డిస్కషన్ సెన్స్ లెస్ గా ఉండడమే కాదు, చిరాకేస్తుంది కూడా. కనీస స్థాయి లాజిక్స్ లేకుండా ఆ సీన్ ని ఎలా రాసుకున్నారో ఏమో అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ చూస్తే న్యాయ వ్యవస్థ మీద గౌరవం, నమ్మకం పెరుగుతాయి.. సెకండ్ పార్ట్ చూసినప్పుడు ఒక జడ్జి ఎంత నిజాయితీపరుడైతే, వ్యవస్థ అంత బాగుంటుంది అనే భావన కలుగుతుంది. కానీ.. ఈ మూడో పార్ట్ చూసాక మాత్రం.. మరీ ఇంత సెన్స్ లెస్ గా సినిమా ఎలా తీశారు అనిపిస్తుంది. ఇది కచ్చితంగా దర్శకుడు సుభాష్ కపూర్ వైఫల్యం అనే చెప్పాలి.

విశ్లేషణ:
సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు అద్దం పడుతూ తెరకెక్కే సినిమాలు నిజాయితీగా ఉండడం అనేది చాలా అవసరం. ఏదో సెంటిమెంట్, ఎమోషన్ పండాలి కాబట్టి సదరు సందర్భాలను ఇరికిస్తే అవుట్ పుట్ ఎంత వికారంగా ఉంటుంది అనేందుకు “జాలీ ఎల్.ఎల్.బి 3” ఓ కాస్ట్లీ ఉదాహరణ. ఇలాంటి కంటెంట్ లేని కథలతో మంచి ఫ్రాంచైజ్ విలువ తగ్గించడం తప్ప.. అటు నిర్మాతకి కానీ, హీరోలకి కానీ, ఆడియన్స్ కి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు.

ఫోకస్ పాయింట్: గాలి వాదనలు!

రేటింగ్: 1.5/5

డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags