విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంపై తీస్తున్న బయోపిక్ స్టార్స్ తో నిండిపోతోంది. నందమూరి, నారా కుటుంబసభ్యులు ఎక్కువమంది ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అలాగే తారక్ ని కూడా కీలకపాత్రలో నటింపచేయించేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పుడు బాలకృష్ణ, తారక్ మధ్య దూరం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు బాబాయ్, అబ్బాయ్ మధ్య అనుబంధం పెరిగింది. అందుకే తారక్.. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడానికి ఓకే చెప్పారు. అయితే మొదటి పార్ట్ కథానాయకుడు చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయింది. ఈ మూవీ జనవరి 9 న రిలీజ్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయినా తారక్ ని ఈ చిత్రంలో భాగం చేయాలనీ దర్శకుడు క్రిష్ ఆలోచించారు. అందుకే ఈ చిత్రం ప్రారంభంలో ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది.
ఆ వాయిస్ ఓవర్ తారక్ తో చెప్పిస్తే బాగుంటుందని ఆలోచన రావడం.. అందుకు అతను ఒకే చెప్పడం జరిగిపోయాయని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఇది నందమూరి అభిమానులకు ఎంతో సంతోషించదగ్గ విషయం. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడు మూవీ షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మ పాత్రలో విద్యాబాలన్ కనిపించనుంది. ఏఎన్నార్ గా సుమంత్, కృష్ణ గా సుధీర్ బాబు, చంద్రబాబు నాయుడిగా రానా నటించనున్న ఈ చిత్రంలో నరేష్ నిర్మాత బొగట వెంకట సుబ్బారావు పాత్రలో కనిపించనున్నారు. శ్రీదేవి పాత్రకోసం రకుల్ ప్రీత్ సింగ్ ని , జయప్రద రోల్ కోసం మిల్క్ బ్యూటీ తమన్నాని తీసుకున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలు కలక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు.