ఆ సీనియర్ హీరోయిన్ జీవితం ఆధారంగా “జూలీ 2”

హీరోహీరోయిన్లు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సంఘ సంస్కర్తల జీవితాల ఆధారంగా సినిమాలు రూపొందడం సర్వసాధారణం అయిపోయింది ఈమధ్యన. అయితే.. సినిమా మొదలెట్టడానికి ముందే అది ఎవరి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అనే విషయాన్ని ప్రకటించి బోలెడంత పబ్లిసిటీతో సదరు సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. కానీ.. మొట్టమొదటిసారిగా ఒక సినిమా రెండ్రోజుల్లో రిలీజ్ అనగా ఆ చిత్రాన్ని ఎవరి జీవితం ఆధారంగా తెరకెక్కించారో బయటపెట్టారు. అదేంటంటే.. రాయ్ లక్ష్మీ టైటిల్ పాత్రలో హిందీలో రూపొందిన చిత్రం “జూలీ 2”, హీరోయిన్స్ రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదలవుతుంది. సెన్సార్ బోర్డ్ హెడ్ పహ్లాజ్ నిహ్లానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

మరి సినిమాకి పెద్దగా బజ్ లేదనుకొన్నారో లేక ఇంకాస్త పబ్లిసిటీ అవసరం అనుకొన్నారో తెలియదు కానీ.. ఉన్నట్లుండి ఈ సినిమా ప్రముఖ సీనియర్ నటీమణి నగ్మా జీవితం ఆధారంగా ఋపొందిందంటూ ఒక స్టేట్ మెంట్ వదిలారు. దాంతో ఉన్నట్లుండి ఈ సినిమాపై విశేషమైన అంచనాలు పెరిగాయి. ఆల్రెడీ ట్రైలర్ లో ఉన్న అడల్ట్ కంటెంట్ యూత్ ని విశేషంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు నగ్మా జీవితం ఆధారంగా రూపొందింది అని ప్రచారం మొదలెట్టడంతో మధ్యవయస్కులు కూడా “జూలీ 2” రిలీజ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. నగ్మా మాత్రం నా జీవితానికి “జూలీ 2” చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ స్టేట్ మెంట్ ఇచ్చింది. మరి సినిమా యూనిట్ చేస్తున్న ఈ హడావుడి సినిమా ఓపెనింగ్స్ వరకూ ఉపయోగపడుతుంది సరే.. సినిమాలో కంటెంట్ లేకపోతే మాత్రం ఇంత రచ్చా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus