సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రంగస్థలం ఇండస్ట్రీ హిట్ సాధించింది. నాన్ బాహుబలి రికార్డులన్నిటినీ సొంతం చేసుకుంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిట్టిబాబు పాత్రలో అదరగొట్టగా.. సమంత రామలక్ష్మిగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వీరిద్దరూ గోదావరి యాసలో కిరాక్ పుట్టించారు. చెర్రీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగా.. సమంతకు జ్యోతి వర్మ డబ్బింగ్ చెప్పింది. ఏ మాయ చేసావే సినిమా నుంచి సమంతకు గాయని చిన్మయి డబ్బింగ్ చెప్పేది. ఈ సినిమాకి మాత్రం గోదావరి యాస వచ్చిన అమ్మాయి కావాలని డైరక్టర్ కోరడంతో చిత్ర బృందం జ్యోతి వర్మ పేరు చెప్పారు. ఈమె వేదం సినిమాలో అనుష్క కు డబ్బింగ్ చెప్పింది. అంతేకాదు కంచె, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ , రేయ్, రాజు గారి గది 2, నాయకి, ధోని వంటి వంద సినిమాలకు గొంతు ఇచ్చింది.
అయినా ఎక్కువమందికి ఈమె గురించి తెలియదు. రంగస్థలంతో వెలుగులోకి వచ్చింది. రీసెంట్ గా జ్యోతి వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. “నేను పుట్టి పెరిగింది మొత్తం పోలవరం లోనే. కాబట్టి నాకు గోదావరి యాస మీద మంచి పట్టుంది. అందుకే రామలక్ష్మి పాత్రకు సులువుగా డబ్బింగ్ చెప్పగలిగాను” అని వివరించింది. ఇంకా ఆమె మాట్లాడుతూ “నేను వేదంలో అనుష్కకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు డైరక్టర్ క్రిష్ నాకు చాలా నేర్పించారు. తొలిసారి ఆ పాత్రకు అభినందనలు వచ్చాయి. ఆ తర్వాత రంగస్థలానికి మంచి పేరు వచ్చింది” అని జ్యోతి వెల్లడించింది.