దక్షిణాది సినీ పరిశ్రమ అనగానే అందరికీ ఇతర ప్రాంతాలవారికి తమిళ చిత్రాలే గుర్తుకువచ్చేవి. ఆ విధంగా కోలీవుడ్ ప్రచారం చేసుకునేవి. శంకర్ తీసిన రోబో ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించడంతో సౌత్ లో తమదే నంబర్ వన్ ఇండస్ట్రీ అని తమిళ హీరోలు కాలర్ ఎగరేసేవారు. బాహుబలి సినిమా వారి పొగరునంతా దించేసింది. అక్కడి దర్శకనిర్మాతలు సైతం రాజమౌళి కళాఖండాన్ని కీర్తించారు. అయినా ఇప్పటికీ కొంతమంది కోలీవుడ్ హీరోల్లో మార్పు రాలేదంట. ఆ విషయాన్నీ ఆ పరిశ్రమకి చెందిన నిర్మాత మీడియా ముందు వాపోయారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య తమిళ వెర్షన్ రైట్స్ ను తాజాగా కొనుగోలు చేసిన కోలీవుడ్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ తమిళ స్టార్ హీరోల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ” తమిళ హీరోలంతా స్వార్థపరులు.
ఒక్కో సినిమాకు 50 కోట్ల పారితోషికం తీసుకుంటారు. కానీ తెలుగు పరిశ్రమను చూస్తే వంద కోట్ల వసూళ్లను రాబట్టే హీరోలు కూడా కేవలం 15 నుండి 20 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నారు. ఈ విషయంలో తమిళ హీరోలు వాళ్లని చూసి చాలా నేర్చుకోవాలి. ఉత్తరాదిన రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. మన తమిళ చిత్రాలకు లేదు. అందుకు కారణం.. మన సినిమాల్లో రిచ్ నెస్ అసలు ఉండదు. కానీ తెలుగులో నిర్మాణ విలువలు.. రిచ్ నెస్ బాగుంటాయి. అలాగే ఓవర్సీస్ లో కూడా బలమైన మార్కెట్ ను తెలుగు వాళ్లు ఏర్పర్చుకున్నారని ” ఆయన తెలిపారు. హీరోల రెమ్యునరేషన్, నిర్మాణ విలువలు, ఓవర్ సీస్ లో విస్తరించిన మార్కెట్ .. ఈ మూడు విషయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ కోలీవుడ్ ని మాత్రమే కాదు బాలీవుడ్ ని సైతం ఢీ కొడుతోంది. దేశంలోనే నంబర్ వన్ పరిశ్రమగా ఎదుగుతోంది.