కాలా

  • June 7, 2018 / 07:11 AM IST

అసలు రజనీకాంత్ సినిమా అనగానే ఏదో తెలియని ఎక్సైట్ మెంట్. విజిల్ వేయడం రానోడితో కూడా విజిల్ వేయించగల స్టార్ పవర్ ఉన్న ఏకైక నటుడు రజనీకాంత్. అందుకే హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన నటించిన ప్రతి సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాల్సిందేనని ప్రతి సినిమా అభిమాని భీషించుకొని కూర్చుంటాడు. “కబాలి”తో నిరాశపరిచిన రంజిత్ మరి “కాలా”తో ఏమేరకు అలరించాడో తెలియాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.

కథ : శ్రామికులు, అణగదొక్కబడినవారు నివసించే ముంబైలోని ధారావి ప్రాంతాన్ని “ప్యూర్ ముంబై” పేరిట నాశనం చేసి అక్కడ అపార్ట్ మెంట్లు కట్టాలని ప్రయత్నిస్తుంటాడు హరిదాదా (నానా పాటేకర్). రాజకీయంగా, ఆర్ధికంగా మహాబలుడైన హరిదాదాకు అడ్డుగా నిలుస్తాడు కాలా అలియాస్ కరికాలన్ (రజనీకాంత్). హరిదాదాతో యుద్ధంలో తన భార్య, కొడుకును కోల్పోతాడు కాలా.. అప్పట్నుంచి అంతర్యుద్ధం కాస్తా ప్రచ్చన్న యుద్ధంగా మారుతుంది. చివరికి యుద్ధంలో గెలిచింది ఎవరు? ధారావి ప్రజల భవిష్యత్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన సినిమా “కాలా”.

నటీనటుల పనితీరు : మొట్టమొదటిసారిగా రజనీకాంత్ ఒక హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఆయన పాత్రలో హీరోయిజం ఎలివేట్ చేయడానికి బోలెడంత స్కోప్ ఉన్నప్పటికీ.. రంజిత్ ఆయన్ని ఒక సామాన్యుడిగానే చూపించాడు. నటన పరంగా రజనీ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది తన పాత్రలో జీవించేశాడాయన. హ్యూమా ఖురేషీ మంచి పాత్రలో ఆకట్టుకొంది. కాలా భార్య పాత్రలో ఈశ్వరిరావు నటన బాగున్నప్పటికీ.. ఆమె వాయిస్ కోవై సరళను గుర్తుకుతెస్తుంది. అయితే.. ఓ సగటు గృహిణిగా ఆమె పలికించిన హావభావాలు మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

నానా పాటేకర్ కనబరిచిన ఠీవీ, విలనిజం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజల్ని అణగదొక్కే ఓ బడా వ్యక్తి పాత్రను అవలీలగా పోషించాడు నానా పాటేకర్. ఆయన క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసిన విధానం, ప్రతివాడు తన చెప్పులు తాకాలనుకొనే విధంగా ఆయన చూపించే గర్వం చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. సముద్రఖని, అంజలి పాటిల్ లు ఈ చిత్రంలో కాస్త ఓవర్ యాక్షన్ చేశారనిపిస్తుంది. వారి పాత్రలకు సినిమాలో మంచి ఎలివేషన్ ఉన్నప్పటికీ.. వారి అతి కారణంగా ఆ ప్రాధాన్యత కనిపించలేదు.

సాంకేతికవర్గం పనితీరు : మురళి.జి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ధారావిలోని మురికిగుంటలను ఎంత సహజంగా తెరకెక్కించాడో.. అక్కడి ప్రజల్లోని ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని తన కెమెరా లెన్స్ తో అంతే అద్భుతంగా ఎలివేట్ చేశాడు. క్లైమాక్స్ లో షాట్ కోసం మురళి పడిన శ్రమకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ముఖ్యంగా.. పోలీస్ స్టేషన్ లో నానా పాటేకర్ అదే రూమ్ లో ఉన్నాడని చూపిస్తూ చేసిన ఫోకస్ పుల్లింగ్ షాట్, అలాగే.. హరిదాదా ఇంట్లో కాలా కాలు టేబుల్ మీద చాపి కూర్చునే సన్నివేశంలో డట్చ్ యాంగిల్ షాట్స్, ట్రాలీ షాట్స్ అబ్బురపరుస్తాయి.

సంతోష్ నారాయణన్ “కాలా” విషయంలో నేపధ్య సంగీతం కంటే కూడా సౌండ్ డిజైనింగ్ కి ఎక్కువ స్కోప్ ఇవ్వడం ప్లస్ అయ్యింది. సీరియస్ డిస్కషన్స్ టైమ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కాకుండా క్లాక్ సౌండ్ తో “డన్ కిర్క్” తరహాలో క్లాక్ టిక్లింగ్ సౌండ్ ను వాడిన విధానం ఇంటెన్సిటీని బాగా ఎలివేట్ చేసింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నా.. ఈ తరహా సన్నివేశాలన్నీ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసి ఉండడంతో కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది.

ఇక దర్శకుడు పా.రంజిత్ గురించి మాట్లాడుకోవాలి.. తాను ఓ తక్కువ స్థాయి కులానికి చెందినవాడ్ని అనే భావన ఆయనలో చాలా ఎక్కువ అనే విషయం ఆయన ప్రతి సినిమాలో కనిపిస్తూనే ఉంటుంది. “మద్రాస్, కబాలి” సినిమాల్లో అది ప్రస్పుటంగా కనిపిస్తే.. “కాలా” సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు అణగదొక్కబడుతున్నారు అనే తన బాధను, కొన్ని వర్గాల ప్రజలను ఎదుర్కొంటున్న కష్టాలను అందరికీ తెలియజెప్పాలనే ఆయన ధ్యేయాన్ని అగౌరవపరచలేమ్. కానీ.. ఒక ఫిలిమ్ మేకర్ గా ఆయన తన సిద్ధాంతాల్నీ ప్రేక్షకుల మీద రుద్దాడానికి చేసే ప్రయత్నం మాత్రం మానుకోవాలి.

మన దేశంలో అగ్రవర్ణం అనేది ఎప్పుడు కిందవర్గాన్ని, ఆ వర్గపు ప్రజల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ రాచరికపు పద్ధతి నేటి నవతరంలోనూ జరుతూనే ఉంది. అయితే.. రజనీకాంత్ లాంటి ఒక స్టార్ ను పెట్టుకొని కేవలం ఆ సమస్య మీద మాత్రమే పోరాడతానుమ్ ప్రశ్నిస్తాను అంటే ఎలా. సినిమాకి వచ్చేసి ధారావి ప్రజలు లేక అణగదొక్కబడుతున్న ప్రజలు మాత్రమే కాదు, అన్నీ వర్గాల ప్రేక్షకులూ వస్తారు. సినిమా అనేది అందర్నీ ఆకట్టుకొనే విధంగా ఉండాలి కానీ.. నాది ఈ వర్గం, నేను ఇన్ని కష్టాలు పడ్డాను, నా వర్గం వారు ఇప్పటికీ ఇన్ని కష్టాలు పడుతున్నారు.. కాబట్టి నేను ఇలాంటి సినిమాలు మాత్రమే తీస్తాను అంటే కుదరదు. రంజిత్ సినిమాల్లో సహజత్వం ఉంటుంది.. అది ఎవరూ కాదనలేని నిజం, కానీ సహజత్వంలో సమానత్వం కూడా ఉండాలి.

ఆ సమానత్వంలో నుండి ఎంటర్ టైన్మెంట్ (కేవలం కామెడీ మాత్రమే కాదు) పుట్టాలి లేదా ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేయాలి కానీ.. 167 నిమిషాలపాటు కష్టాలను చూపిస్తాను, అగ్రవర్ణపు జులుం చూపిస్తాను అంటే సినిమాను చూసే స్థితిలో ప్రేక్షకులు లేరు. ఈ విషయాన్ని పా.రంజిత్ ఇప్పటికైనా గ్రహించాలి.. “కబాలి” కంటే కాస్త బెటర్ అని చెప్పొచ్చు కానీ.. “కాలా” అందర్నీ ఆకట్టుకొనే సినిమా మాత్రం కాదు.

విశ్లేషణ : ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, రజనీకాంత్ అభిమానుల కోసం కొన్ని ఎలివేషన్ సీన్స్, స్లోమోషన్ షాట్స్, రెండు ఫైట్స్ ఉన్నాయి. అయితే.. అన్నివర్గాల ప్రేక్షకులని అలరించే లేదా ఆకట్టుకొనే కంటెంట్ మాత్రం కాదు. రంజిత్ తన మార్కిస్ట్ భావజాలాన్ని, అంబేడ్కర్ ఆలోచనాధోరణిని ప్రజల మీద రుద్దడానికి చేసిన ప్రయత్నం మాత్రం రుచించదు.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus