దుల్కర్ సల్మాన్ హీరోగా రానా ఎప్పుడో 2019లో ఎనౌన్స్ చేసిన సినిమా ఎట్టకేలకు 2025లో విడుదలైంది. ప్రీప్రొడక్షన్, మేకింగ్ & పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జరిగిన డిలే కారణంగా ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వడానికి ఇన్నేళ్లు పట్టింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి రేపాయి. ముఖ్యంగా రెట్రో స్టైల్ మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదరూపంలో విడుదల చేశారు. మరి ఈ పీరియాడిక్ డ్రామా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: సినిమా ప్రపంచానికి కమర్షియాలిటీ హంగులు అద్దుకుంటున్న తరుణంలో.. ప్రేక్షకుల అంగీకారంతో స్టార్ హీరోగా ఎదిగిన టి.కె.మహదేవన్ (దుల్కర్), అతడి ఎదుగుదలకు కారకుడైన అయ్య (సముద్రఖని) నడుమ అహంకారం కారణంగా మొలిచిన ఓ మహావృక్షం “శాంత” అనే సినిమా షూటింగ్ సమయానికి ఉచ్ఛస్థాయికి చేరుకుంటుంది. ఈ ఇద్దరి నడుమ నలిగిన కుమారి (భాగ్యశ్రీ) ఈ కథను ఓ కొత్త కోణంలో ముందుకు తీసుకెళ్తుంది.
ఏమిటా కోణం? ఈ అహంకార పొరపచ్చాలు తొలగాయా? అందుకు ఎలాంటి నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “కాంత” చిత్రం.
నటీనటుల పనితీరు: దుల్కర్ సల్మాన్ లాంటి నటుడు జనరేషన్ కి ఒకడు మాత్రమే ఉంటాడు. ఇప్పటివరకు దుల్కర్ ను చూసిన స్థాయి వేరు.. ఇకపై అతడ్ని చూడబోయే స్థాయి వేరు. ట్రైలర్లో కనిపించిన మిర్రర్ షాట్ ను దుల్కర్ సింగిల్ టేక్ లో చేశాడు అంటే నటుడిగా అతడి రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ మిర్రర్ షాట్ కి ముందు వచ్చే ఎస్టాబ్లిష్మెంట్ సీన్ కూడా బాగుంటుంది. అలాగే.. మనసులో, కళ్లల్లో లోతును ఠీవీతో కవర్ చేసిన విధానం అతడి సిన్సియారిటీని ప్రూవ్ చేస్తుంది.
ఇక సముద్రఖనిని ఇప్పటివరకు ఓ సగటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంత అండర్ యూటిలైజ్ చేస్తున్నామో ఈ సినిమాలో అయ్య పాత్ర చూసాక తెలుస్తుంది. కోపాన్ని కూడా సమ్యవనంతో ప్రకటించిన విధానం ఒక కొత్త తరహా యాక్టింగ్ క్లాస్ ను ఆడియన్స్ కు ఇస్తుంది.
భాగ్యశ్రీ ఒక రెట్రో హీరోయిన్ గా లుక్స్ పరంగా ఒదిగిపోయింది కానీ.. నటిగా మాత్రం పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయింది. చాలాచోట్ల హావభావాలతో ఆకట్టుకోవాల్సిన అమ్మడు.. ముక్తసరి నటనతో సరిపెట్టేసింది. ముఖ్యంగా “నవ్వు ముఖం” అనే సన్నివేశానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయింది.
షెరలాక్ హోమ్స్ కి ఇండియన్ వెర్షన్ లా కనిపించాడు రానా. అతడి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ కథనానికి చాలా హెల్ప్ అయ్యాయి.
రవీంద్ర విజయ్ స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: డానీ శాంచెజ్ లోపెజ్ కెమెరా వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సన్నివేశం ఒక పెయింటింగ్ లా కనిపిస్తుంది. లైటింగ్ కానీ, కలరింగ్ కానీ అత్యద్భుతంగా ఉన్నాయి. ఈమధ్యకాలంలో ఈస్థాయి కెమెరా వర్క్ అనేది మరో సినిమా విషయంలో చూడలేదు.
ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ టీమ్ ను కూడా కచ్చితంగా మెచ్చుకోవాలి. 70వ దశకం స్టూడియో కల్చర్ ను చాలా పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేశారు. సీజీ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. గ్రీన్/బ్లూ మ్యాట్ సీన్స్ విషయంలో చాలా చోట్ల దొరికిపోయారు.
జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషన్స్ ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. జాను చాంతర్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. కథని ముందుకు నడిపేందుకు ఉపయోగపడ్డాయి కూడా.
దర్శకుడు సెల్వమణి, రచయిత తమిళ ప్రభ “కాంత” కథను డిజైన్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. ఒక క్లాసిక్ కి కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. డ్రామా & పేసింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఈ తరహా సినిమాలకు పేసింగ్ కాస్త స్లో ఉంటుంది అనేది వాస్తవమే కానీ.. సెకండాఫ్ లో ఆ పేస్ అనేది ఇంకాస్త వేగవంతం అయితే బాగుండు అనిపించింది. అవసరం కూడా. కానీ.. క్లైమాక్స్ ను మలిచిన విధానం, అక్కడ దుల్కర్ పెర్ఫార్మెన్స్ మాత్రం సంతృప్తినిచ్చాయి. స్క్రీన్ ప్లే తోకంటే కూడా ఎమోషన్స్ తో మ్యాజిక్ చేశాడు సెల్వమణి.
విశ్లేషణ: కొన్ని సినిమాలు కథ, కథనం కోసం చూస్తుంటాం. కానీ.. కొన్ని సినిమాలు ఎక్స్ పీరియన్స్ కోసం చూడాలి. అలాంటి సినిమానే “కాంత”. 70ల నాటి స్టూడియో సంస్కృతి, మనిషిలోని డార్క్ షేడ్ ను సెల్వమణి ప్రెజంట్ చేసిన తీరు.. వాటిని దుల్కర్ సల్మాన్ అద్భుతంగా కాంప్లిమెంట్ చేసిన తీరు, డానీ ఈ ప్రపంచాన్ని చిత్రీకరించిన విధానం కచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అయితే.. సినిమాలో సంభాషణలు ఎక్కువగా ఉండడం, సినిమా మొత్తం తమిళంలోనే తీయడంతో.. డబ్బింగ్ చాలా ఎబ్బెట్టుగా ఉంది. ముందే ఈ సినిమాని డబ్బింగ్ సినిమాగా ప్రమోట్ చేసి ఉంటే బాగుండేది. తమిళ-తెలుగు బైలింగువల్ గా ప్రమోట్ చేయడం వల్ల.. రెండు భాషల్లోనూ షూట్ చేసారు అనుకుని.. తెలుగు వెర్షన్ లో క్లారిటీ ఆశిస్తాం. అది నిరాశకు దారి తీస్తుంది. ఈ విషయంలో రానా ఇంకాస్త కేర్ ఫుల్ గా ఉండాల్సింది.
ఫోకస్ పాయింట్: అబ్బురపరిచే దుల్కర్ నటవిశ్వరూపం!
రేటింగ్: 3/5