కాశి

  • May 18, 2018 / 09:21 AM IST

“భేతాలుడు, యమన్, ఇంద్రసేన” వంటి వరుస డిజాస్టర్స్ తర్వాత విజయ్ ఆంటోనీ నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం “కాశి”. “బిచ్చగాడు” సినిమాలో తనకు బాగా అచ్చొచ్చిన మదర్ సెంటిమెంట్ ను బేస్ చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడిన అనంతరం ఎట్టకేలకు నేడు (మే 18) విడుదలైంది. మరి హ్యాట్రిక్ ఫ్లాప్స్ చవిచూసిన విజయ్ ఆంటోనీని “కాశి” అయినా కాపాడిందా లేదా అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ : ఆల్రెడీ విడుదలైన మొదటి 7 నిమిషాల్లోనే బేసిక్ స్టోరీలైన్ ఏంటనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసిన విజయ్ ఆంటోనీ.. సినిమా చూశాక కథగా రాయడానికి నాకు పెద్దగా ఆప్షన్ ఇవ్వలేదు. సొంత తల్లిదండ్రుల కోసం భరత్ అలియాస్ కాశి (విజయ్ ఆంటోనీ) అమెరికా నుంచి ఇండియాకి వచ్చి మొదలెట్టిన ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులు, గోపి (యోగిబాబు) ఊహించుకొన్న ఊహల సమాహారమే “కాశి” సినిమా. సినిమాలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని పబ్లిసిటీ చేసిన విజయ్ ఆంటోనీ, మదర్ సెంటిమెంట్ కంటే లవ్ స్టోరీస్ ను ఎక్కువగా హైలైట్ చేయడంతో సినిమా జోనర్ ఏమిటనేది డైరెక్టర్ గారే చెప్పాలి.

నటీనటుల పనితీరు : కథానాయకుడిగా విజయ్ ఆంటోనీ నటించిన 10వ సినిమా ఇది. అయినప్పటికీ.. ఇంకా ఇది ఈయనకి మొదటి సినిమా ఏమో అనుకొనే స్థాయిలో నటించాడు విజయ్ ఆంటోనీ. తొమ్మిది సినిమాల్లో నటించిన తర్వాత కూడా విజయ్ నటన పరంగా ఏమాత్రం డెవలప్ అవ్వకపోవడం గమనార్హం. హీరో ఫ్రెండ్ గోపీ పాత్రలో యోగిబాబు హావభావాలు, పంచ్ డైలాగ్స్ తోపాటు టీషర్ట్స్ కూడా ప్రేక్షకుల్ని అలరించి నవ్విస్తాయి కథానాయికలుగా అంజలి, సునైన, శిల్ప మంజునాధ్, అమృత అయ్యర్ లు కనిపించీ కనిపించనట్లుగా ఒక్కోపాటలో మెరిసి మాయమయ్యారు. వారి ప్రతిభా కనబరచడానికి పెద్దగా అవకాశం ఇవ్వకపోవడంతో బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్స్ గా మిగిలిపోయారు.

జయప్రకాష్, నాజర్, మధు సింగనపల్లిల స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నా.. వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం.. పైగా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ లోనూ విజయ్ ఆంటోనీ నటించడం అనేది సినిమాకి మైనస్ గా నిలిచింది.

సాంకేతికవర్గం పనితీరు : విజయ్ ఆంటోనీ ట్యూన్స్ బాగున్నా.. దానికి సమకూర్చబడిన సాహిత్యం మాత్రం వెటకరంగా ఉంది. ఆల్మోస్ట్ అన్నీ పాటలూ ఒకేలా ఉన్నట్లుగా అనిపించేలా చేసింది ఆ సాహిత్యం.
ప్రొడక్షన్ వేల్యూస్, గ్రాఫిక్స్, కెమెరా వర్క్, ఎడిటింగ్, ఫైట్ సీన్స్ వంటివన్నీ బాగున్నప్పటికీ.. కథలో కంటెంట్, కథనంలో విషయం లేకపోవడం వల్ల ఆ బాగున్న అంశాలేవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేవు.

దర్శకురాలు కృతిగ ఉదయనిధి స్టాలిన్ రాసుకొన్న స్టోరీలైన్ ఫార్మాట్ బాగున్నా.. ఆ స్టోరీని నడిపించడానికి రాసుకొన్న కథనం మాత్రం కనీస స్థాయిలో ఆకట్టుకొనే విధంగా లేకపోవడం అనేది సినిమాకి పెద్ద మైనస్. అనవసరమైన లవ్ ట్రాక్స్, కథతో ఏమాత్రం సంబంధం లేని సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో.. అసలు కథ ఏమైందో ప్రేక్షకుడికి అర్ధం కాకపోవడం, తెలుగులో డబ్బింగ్ చేస్తారని ముందే తెలిసినా సినిమా మొత్తం ఆరవ సాంబారు వాసన గుప్పుమనడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం.

నాలుగు కథానాయికలు, ఒక కమెడియన్, నాలుగు ఫైట్లు, హీరో ఎలివేషన్ కి బోలెడంత స్కోప్, అన్నిటికీ మించి సినిమా మొత్తంలో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయగల లెక్కలేనన్ని ట్విస్ట్స్. ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైందంటే కారణం విజయ్ ఆంటోనీ సింగిల్ ఎక్స్ ప్రెషన్, పట్టు లేని కథనం. రచయితగా పర్వాలేదనిపించుకొన్న కృతిగ, దర్శకురాలిగా మాత్రం విఫలమైంది. ఇకపోతే.. విజయ్ ఆంటోనీ విభిన్నమైన కథలను ఎంచుకోవడంతోపాటు పది సినిమాలు పూర్తి చేసుకొన్నాడు కాబట్టి ఇప్పటికైనా నటన మీద, హావభావాల ప్రదర్శన మీద దృష్టిసారిస్తే మంచిది. లేదంటే మాత్రం ఇకపై ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టమే.

విశ్లేషణ : స్క్రీన్ ప్లే అనేది ఎప్పుడైనా సరే ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఉత్సుకత కలిగించేలా ఉండాలి కానీ.. ఉన్న ఇంట్రెస్ట్ పోయి నీరసం వచ్చేలా ఉండకూడదు. “కాశి” సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ అదే. సినిమా కథలో, క్యారెక్టరైజేషన్స్ లో ప్రేక్షకుల్ని కుర్చీలో నుంచి లేవకుండా చేసే అద్భుతమైన స్కోప్ ఉన్నప్పటికీ.. దర్శకురాలు, కథానాయకుడు విఫలమవ్వడంతో.. సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టమనే చెప్పాలి. అయితే.. లక్కీగా ఈవారం వేరే సినిమాలేవీ లేవు కాబట్టి విజయ్ కి ఒకరకంగా కలిసొచ్చింది. మరి ఈ లక్కీ ఛాన్స్ ని విజయ్ ఏమేరకు వినియోగించుకొంటాడో చూద్దాం.

రేటింగ్ : 1.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus