‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక తో ‘మంత్ర’ దర్శకుడి సినిమా

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దక్షిణ’. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు ‘మంత్ర’, ‘మంగళ’ తీసిన ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు.  ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. నేడు రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ చేశారు.

హైదరాబాద్‌లోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ‘దక్షిణ’ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత వంశీకృష్ణ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రణతి, శ్వేతా భావన క్లాప్ ఇచ్చారు.

చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ”సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. తెలుగులో ‘మంత్ర’, ‘మంగళ’ ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సినిమాల తరహాలో ‘దక్షిణ’ ఉంటుంది. మూడు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేశాం. తొలి షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు జరుగుతుంది. రెండో షెడ్యూల్ గోవాలో అక్టోబర్ 6 నుంచి 20వ తేదీ వరకు ప్లాన్ చేశాం. మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో నవంబర్ 1 నుంచి 10 వరకు జరుగుతుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. నటీనటులతో పాటు ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus