సినిమా పాటల కంపోజింగ్ విషయంలో స్ఫూర్తి పొందడం తప్పులేదని సంగీత దర్శకుడు శ్రీ కళ్యాణ్ రమణ చెప్పారు. మనం స్వర పరిచిన స్వరాల వెనుక ఏదో పాత పాట ప్రభావం తప్పక ఉంటుందని వివరించారు. కాపీకి, ఇన్స్పిరేషన్ కు సన్నని గీత లాంటి తేడా ఉంటుందని తెలిపారు. “మనకు నచ్చిన పాటలోని ఆత్మను తీసుకుని, ఆ పాట గుర్తుకు రాకుండా మన ఫ్లేవర్ కలిపి ఇవ్వడం స్ఫూర్తి అయితే, ఆ పాటలోని సాహిత్యాన్ని మాత్రమే మార్చి ట్యూన్, వాయిద్యాలను అలాగే ఉపయోగిస్తే అది కాపీ అవుతుంది. ఒక సంగీత దర్శకుడు పాటను కాపీ చేసాడంటే అతని ఒక్కరి తప్పే ఉందని అనుకోకూడదు. హీరో, డైరక్టర్ ఒత్తిడి కూడా ఉండొచ్చు అనే సంగతిని గుర్తించాలి” అని శ్రీ కళ్యాణ్ రమణ వెల్లడించారు. “ఈ మధ్య ఎస్.ఎస్. తమన్ ఫ్రెంచ్ పాటను కాపీ చేసాడని సోషల్ మీడియాలో కామెంట్లు చూసి బాధపడ్డాను.
అతను మంచి సంగీత దర్శకుడు. కొత్త వాయిద్యాలను ఉపయోగించి చక్కని పాటలు ఇచ్చారు. ఎక్కువ అభిమానులున్నారు. దీని వల్ల అతనిపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. నవలలోని డైలాగులు, ఇతర సినిమాల్లోని సీన్లు మక్కికి మక్కి దించినా పెద్దగా పట్టించుకోరు. కానీ పాటల విషయంలో మాత్రం సులువుగా కనిపెట్టేస్తున్నారు. టెక్నాలజీ అలా ఉపయోగపడుతోంది” అని సంగీత దర్శకుల కష్టాలను నిర్మొహమాటంగా చెప్పారు.