ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కంగన రనౌత్ (Kangana Ranaut) ప్రస్తుతం ఫ్లాప్‌ల బాటలో నడుస్తూ తన గత వైభవాన్ని కోల్పోయింది. 2011 నుంచి 2015 మధ్యకాలంలో బాక్సాఫీస్‌ను శాసించిన కంగన ఫస్ట్ టైమ్ క్వీన్ (Queen) సినిమాతో బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు అందుకున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. జాతీయ అవార్డులతోనూ తన ప్రతిభను చాటుకుంది. కానీ గత పదేళ్లలో ఆమె సక్సెస్ సున్నా అంటే మార్కెట్ ఏ రేంజ్ లో డౌన్ అయ్యిందో చెప్పవచ్చు.
మంచి టాలెంటెడ్ అయినప్పటికీ, ప్రేక్షకుల నుంచి నమ్మకం కోల్పోయిన ఆమె భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘తను వెడ్స్ మను’ (Tanu Weds Manu Returns) సిరీస్, ‘క్వీన్’ వంటి బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్‌ను గడగడలాడించిన కంగన, తన ప్రత్యేకతను నిలబెట్టుకోలేకపోయింది. రికార్డ్ బ్రేకింగ్ విజయాలు అందుకున్న ఈ స్టార్ హీరోయిన్, గతంలో స్టార్ హీరోల అవసరం లేకుండా సినిమాలను సక్సెస్‌ఫుల్‌గా నడిపింది. కానీ 2015 తర్వాత, ఆమె చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.
‘తను వెడ్స్ మను రిటర్న్స్’ విజయం తర్వాత చేసిన 11 చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో, ఆమె కెరీర్‌లో విజయాలు కనిపించని దశకు చేరుకున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదలైన ఆమె తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency) కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోలేకపోయింది. 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కేవలం 15 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగన అద్భుతంగా నటించినప్పటికీ, సినిమాకు సరైన ప్రచారం లేకపోవడం, ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది.
కంగన ఈ సినిమాకి పెట్టుబడుల కోసం తన ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితికి చేరుకుందంటే, ఈ ప్రాజెక్ట్‌పై ఆమె ఎంత ఆశలు పెట్టుకుందో అర్థమవుతుంది. మరోవైపు, కంగన చేసిన గత చిత్రాలు కూడా భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. ‘ధాకడ్,’ (Dhaakad) ‘తలైవి,’ (Thalaivii) ‘తేజస్’ (Tejas) వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కేవలం 17 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేయడం, నిర్మాతలకు తీవ్రమైన నష్టాలను మిగిల్చాయి. ఈ చిత్రాల వైఫల్యం ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గతంలో తన చరిష్మా ఆధారంగా సినిమాలను విజయవంతం చేసిన కంగన, ఇప్పుడు క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతోంది. మరి రానున్న రోజుల్లో అమ్మడు ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.