మెగామేనల్లుడు చిత్రంలో హీరోయిన్ గా కన్నడ భామ?

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. లెక్కల మాస్టారు సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ అయిన ‘సుకుమార్ రైటింగ్స్’ మరియు ‘మైత్రీ మూవీ మేక‌ర్స్‌’ సంస్థల పై ఈ చిత్రం రూపొందుతుంది. ‘రంగస్థలం’ చిత్రానికి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి ‘ఉప్పెన’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే విడుదల చేసిన వైష్ణవ్ తేజ్ ప్రీ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

వైష్ణవ తేజ్ జాలరి గెటప్ లో వున్న ఈ లుక్ సినిమా పై అంచనాలను పెంచింది. ఇక ఈ చిత్రంలో వైష్ణవతేజ్ సరసన హీరోయిన్ గా మంగుళూరు భామ కృతి శెట్టి ని ఎంపికచేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇంతకు ముందు కృతి శెట్టి పలు తమిళ మూవీస్ తో పాటూ ఓ కన్నడ చిత్రంలో కూడా నటించింది. ఇక కోలీవుడ్ క్రేజీ హీరో విజ‌య్ సేతుప‌తి కూడా ఈ చిత్రంలో నటిస్తుండడంతో ఈ చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మే 25 నుండీ ప్రారంభం కానుందట. రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus