యువ కథానాయకుడిగా కంటే కూడా సింగర్ గీతామాధురి భర్తగా అందరికీ సుపరిచితుడైన నందు హీరోగా రూపొందిన తాజా చిత్రం “కన్నుల్లో నీ రూపమే”. బిక్స్ అనే యువ దర్శకుడు తెరకెక్కించిన ఈ ప్రేమకథ చిత్రీకరణ పూర్తై ఏడాది కావస్తున్నా కారణాంతరాల వలన విడుదలవ్వలేకపోయి.. ఎట్టకేలకు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ:
బేసిగ్గా.. “కథ” అనే సబ్ హెడ్డింగ్ ఇక్కడ ఉంది కాబట్టి ప్రత్యేకించి కథ అని రాయడం తప్పితే.. సినిమాలో కథ-కథనం అనేవి ఎక్కడా కనిపించవు. చెంపదెబ్బ కొట్టిన ఓ ముసుగు సుందరి కళ్ళు చూసి ఆమెను ఘాడంగా ప్రేమించేస్తాడు సన్నీ (నందు). ఆ తర్వాత అమ్మాయి తానే స్వయంగా తారసపడడంతో కలిసిన మరు నిమిషం తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. కన్ఫ్యూజన్ లో రెండుసార్లు లాగి కొట్టిన.. కుర్రాడి హెల్పింగ్ నేచర్ తెగ నచ్చేసిన సృష్టి (తేజస్విని ప్రకాష్) పెద్దగా బెట్టు చేయకుండానే సన్నీ ప్రేమను అంగీకరించి.. సరిగ్గా రెండు వారాల్లో పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు. ఇద్దరూ తల్లిదండ్రులు లేని అనాధలు కావడంతో తమ పెళ్ళికి ఎవరూ అడ్డురారని అనుకొంటారు. కానీ.. సృష్టి అన్నయ్య మధ్యలో వస్తాడు. అలా అన్నగారి రాకతో సన్నీ-సృష్టిల ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది అనేది “కన్నుల్లో నీ రూపమే” కథాంశం.
నటీనటుల పనితీరు:
సినిమా ఒప్పుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం నటించేప్పుడు కనిపించలేదు. ఏదో కనిపిస్తున్నాడన్న ధ్యాస తప్ప నటించాలీ, పాత్రను పండించాలీ అనే కోరిక నందులో ఎక్కడా కనిపించలేదు. మనోడి క్యారెక్టర్ కూడా పెద్దగా క్లారిటీ లేకపోవడంతో, నందు పెర్ఫార్మెన్స్ లాగే సినిమా మొత్తం ఏదో వెలితిగా ఉంటుంది. ఇక హీరోయిన్ తేజస్విని ప్రకాష్ అయితే.. నటించాలా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు.. సినిమా మొత్తం అయోమయంగానే కనిపిస్తుంది. ఇక ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసినవాళ్ళందరూ సీన్ దొరికినప్పుడల్లా తమ పెర్ఫార్మెన్స్ తో పేకాటాడేయాలని ప్రయత్నించి విసుగెత్తించారు.
సాంకేతికవర్గం పనితీరు:
మరి ఇచ్చిన బడ్జెట్ సరిపోలేదో లేక ఛాయాగ్రహకుడు ఎన్.బి.విశ్వకాంత్ కి నిజంగానే కెమెరా హ్యాండిలింగ్ పట్ల సరైన అవగాహన లేదో తెలియదు కానీ.. కొన్ని సీన్స్ మరీ యూట్యూబ్ లేదా ఫేస్ బుక్ లో కనిపించే అమెచ్యూర్డ్ వీడియోస్ ను తలపిస్తాయి. ఇక కెమెరా యాంగిల్స్ చూస్తే షార్ట్ ఫిలిమ్స్ బెటారేమో అనిపిస్తుంది. సాకేత్ అందించిన పాటలు కొత్తగా లేకపోయినా కాస్త వినసొంపుగా ఉన్నప్పటికీ.. సదరు పాటల ప్లేస్ మెంట్స్ మరియు పిక్చరైజేషన్ ఏమాత్రం ఆకట్టుకొనే స్థాయిలో లేకపోవడంతో సాకేత్ కష్టం మొత్తం వృధా అయ్యింది. ఎడిటింగ్, కలరింగ్, ఒకట్రెండు సీన్లలో ఉన్న సీజీ వర్క్ కూడా చాలా హేయంగా ఉన్నాయి. అసలే కథ ఏమిటో అర్ధం కాక కూర్చున్న ప్రేక్షకుడు, ఈ ఎడిటింగ్ పుణ్యమా అని కథనం కూడా అర్ధం బుర్ర గోక్కుంటూ థియేటర్ గోడలు లేదా చూడ్డం లేదా థియేటర్ నుంచి బయటపడడం మినహా వేరే ఏమీ చేయలేక మిన్నకుండిపోతాడు.
ఇక దర్శకుడు బిక్స్ విషయానికి వస్తే..
ఆయన సహాయ దర్శకుడిగా ఎవరి దగ్గర వర్క్ చేశాడు, అసలు చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే.. మినిమమ్ ఎక్స్ పీరియన్స్ లేదని ఓపెనింగ్ సీన్ తోనే అర్ధమైపోతుంది. అసలు నిర్మాతను ఏం చెప్పి ఒప్పించాడో తెలియదు కానీ.. స్క్రీన్ ప్లే కానీ.. కథ-కథనం కానీ బూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమల్లో 1 లేదా 2 కోట్ల లోపు కూడా మంచి కాన్సెప్త్స్ తో సినిమాలోస్తుండగా.. బిక్స్ లాంటి కొత్త దర్శకులు కూడా ఇంకా ఇలాంటి అవుట్ డేటెడ్ కాన్సెప్త్స్ తో సినిమాలు తీయడం వల్ల “చిన్న సినిమాలు” అంటే ఇంతేనా అని ప్రేక్షకుల మనసుల్లో ముద్రపడడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. సినిమాకి ఖర్చు పెట్టిన మొత్తంలో కనీసం సగంలో సగమైనా వెనక్కి వస్తుందో లేదో తెలియదు కానీ.. ఇండస్ట్రీకి ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన నిర్మాత మాత్రం మళ్ళీ సినిమాలు తీయడానికి భయపడతాడు.
విశ్లేషణ:
షార్ట్ ఫిలిమ్ కి ఎక్కువ, వెబ్ సిరీస్ కి తక్కువ అన్నట్లుగా ఉన్న “కన్నుల్లో నీ రూపమే” చిత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం తప్ప చేసేదేమీ లేదు. పైగా ఒకేవారం విడుదలవుతున్న 9 తెలుగు సినిమాల్లో ఒకటిగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకొంటారా అనేది పెద్ద ప్రశ్న.
రేటింగ్: 0.5/5