మొన్నీమధ్య అమెరికాలో ఓ ప్రాంతంలో ‘ఓజీ’ సినిమాను ప్రదర్శించడం లేదు అంటూ అక్కడి డిస్ట్రిబ్యూటర్ బహిరంగంగా ఓ లేఖ రిలీజ్ చేశారు. సినిమా రేపో మాపో రిలీజ్ అనుకుంటుండగా.. ఈ ప్రకటన రావడంతో ఓవర్సీస్‌లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే ఆ తర్వాత ఆ ప్రాంతంలో సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు మరోసారి విదేశాల్లో మన సినిమాలకు ఇబ్బంది వచ్చింది. మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కాదు కానీ.. కెనడాలోని ఓ థియేటర్‌లో ఇండియన్ సినిమాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
భారతీయ సినిమాలు ప్రదర్శితమవుతోన్న సమయంలోనే తమ థియేటర్‌పై దాడులు జరుగుతున్నాయని అందుకే ప్రదర్శనను రద్దు చేస్తున్నామని సదరు థియేటర్ యాజమాన్యం తెలిపింది. కెనడాలోని ఓక్‌విల్లే ప్రాంతంలో ఫిల్మ్.కా థియేటర్‌లో వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు దాడులు జరగడం గమనార్హం. దీంతో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తూ ఆ థియేటర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అక్కడ ప్రదర్శితమవుతున్న ‘కాంతార: చాప్టర్ 1’, ‘ఓజీ’ సినిమాలు ఉన్నాయి.
స్థానిక పోలీసులువివరాల ప్రకారం.. సెప్టెంబర్ 25న మొదటిసారి ఫిల్మ్.కా థియేటర్‌పై దాడి జరిగింది. ఇద్దరు అనుమానితులు హాలుకు నిప్పు అంటించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన థియేటర్ భద్రతా సిబ్బంది మంటలను ఆర్పారు. పెద్దగా నష్టం జరగకపోవడంతో అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్టోబర్ 2న మరోసారి దాడి జరిగింది. తెల్లవారుజామున ఒక అనుమానితుడు థియేటర్ ప్రవేశద్వారం వద్ద కాల్పులు జరిపాడు. దీంతో సినిమాల నిలిపివేత నిర్ణయం తీసుకుంది.
అయితే థియేటర్‌పై దాడుల వెనక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు థియేటర్ యాజమాన్యం అనుమానిస్తోంది. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ నిలిపివేత ఎన్ని రోజులు ఉంటుంది. సినిమాలు తిరిగి ఎప్పుడు ప్రదర్శిస్తారు అనే చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఇది ఇండియన్ సినిమాకు ఇబ్బందికర విషయమే.