తెలుగు నటి హేమకు (Hema) కర్ణాటక హైకోర్టు నుంచి కీలకమైన ఊరట లభించింది. గత సంవత్సరం మే నెలలో బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కృష్ణవేణి పేరుతో తెలుగు నటి హేమ పార్టీకి హాజరైనట్లు తెలిపారు. ఇక డ్రగ్స్ తీసుకుందని కేసు నమోదవడంతో, విచారణలో భాగంగా ఆమె రిమాండ్‌కు కూడా వెళ్లింది. అయితే, తాజాగా ఈ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంటూ, ఆమెపై ఉన్న కేసు తదుపరి చర్యలపై స్టే విధించింది.
జస్టిస్ హేమంత్ చందన గౌడర్ తన ఆదేశాల్లో, రేవ్ పార్టీలో హేమ ఎంఎండిఎమ్ డ్రగ్ వినియోగం చేశారని నిరూపించే నమ్మకమైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సహనిందితుల ప్రకటనల ఆధారంగా మాత్రమే హేమపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం సరైన పద్ధతి కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. హేమపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదు చేసిన కేసులో, ఆమె 8వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది.
అయితే, ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు ప్రక్రియ మరియు తదుపరి విచారణలపై హేమ ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ద్వారా స్టే కోరారు. దీనిని సమీక్షించిన హైకోర్టు, స్టే ఇచ్చింది. ప్రస్తుతం హేమ బెయిల్‌పై ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం ఆమెకు న్యాయ పరమైన గణనీయమైన ఊరటగా నిలిచింది. హైకోర్టు నిర్ణయంతో ఆమెపై వచ్చిన ఆరోపణలపై నిజాలు తేల్చే ప్రక్రియలో కీలక మలుపుగా భావిస్తున్నారు.
కేసు పూర్తి స్థాయిలో విచారణకు వచ్చే వరకు, ఈ స్టే ఆమెపై తక్షణ చర్యల నుంచి కాపాడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇది హేమకు తాత్కాలిక ఊరట ఇచ్చినా, చివరికి ఆమె నిర్దోషిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసు సంబంధించి తదుపరి విచారణ తేదీ ఇంకా ఖరారు కాలేదు. న్యాయస్థానం ఆదేశాలతో కేసును హేమ తరపు న్యాయవాదులు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.